వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళవాసులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రం తరుపున కేరళకు రూ.10 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిస్తామని, నగదు, ఇతర సహాయం కలిపి మొత్తం రూ.50 కోట్లు కేరళకు అందించనున్నట్లు ప్రకటించారు. కేరళకు కేంద్రం చేసిన సాయం చాలా చిన్నదన్నారు. మొక్కబడి సాయం చేసి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కేరళ, కర్ణాటక వరద బాధితులకు కేంద్రం అండగా ఉండాలన్నారు. హూదూద్ తుఫాన్ సమయంలో ఏపీకి కేంద్రం అరకొర సాయం చేసిందని గుర్తు చేశారు.