ఏ ఆప్షన్‌కైనా చంద్రబాబు సిద్ధం..!

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికలకు తొమ్మిది నెలలు టైమున్నా రాజకీయం మాత్రం రంజుగా సాగుతోంది. అధికార వైకాపా ఎన్నికల హామీలన్నీ దాదాపు నెరవేర్చి, అదే ఆత్మవిశ్వాసంతో సమరానికి సిద్ధమవుతోంది. తెలుగుదేశం అధ్యక్షుడు అడపా దడపా ఆంద్ర ప్రదేశ్‌లో ప్రయాణిస్తూ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. లోకేష్‌ పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర కూడా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.

Update: 2023-09-03 06:55 GMT

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికలకు తొమ్మిది నెలలు టైమున్నా రాజకీయం మాత్రం రంజుగా సాగుతోంది. అధికార వైకాపా ఎన్నికల హామీలన్నీ దాదాపు నెరవేర్చి, అదే ఆత్మవిశ్వాసంతో సమరానికి సిద్ధమవుతోంది. తెలుగుదేశం అధ్యక్షుడు అడపా దడపా ఆంద్ర ప్రదేశ్‌లో ప్రయాణిస్తూ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. లోకేష్‌ పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర కూడా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. దాదాపుగా పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా తొందరలోనే తన నివేదికను ఇచ్చేస్తుంది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఆ బిల్లును ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఓ నాలుగు నెలల ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ ఎన్నికలు రాష్ట్రంలోని అన్ని పార్టీలకీ అత్యంత ప్రతిష్ఠాత్మకం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాలేకపోతే, ఆ పార్టీని కబళించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. పురంధేశ్వరిని అధ్యక్షురాలిని చేయడం వెనుక వ్యూహం కూడా అదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం కనుక ఈ సారి ఓడిపోతే, మళ్లీ కోలుకోలేకపోవచ్చు. ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే సామాజిక వర్గానికి బీజేపీ తప్ప వేరే దారి ఉండదు.

తెలుగుదేశం పూర్తిగా ఉనికిని కోల్పోవాలని కేవలం బీజేపీ మాత్రమే కాదు వైకాపా కూడా బలంగా కోరుకుంటోంది. దీనివల్ల రాష్ట్రస్థాయిలో ఓ బలమైన మీడియా అండ ఉన్న పార్టీ కనుమరుగు అవుతుంది. భాజపాలోకి తెలుగుదేశం నాయకులు వెళ్లినా, తెలుగుదేశం అనుకూల మీడియా కమలం పార్టీని ఏకపక్షంగా సపోర్ట్‌ చేయదు. ఆ మీడియాకు కూడా కొన్ని పరిమితులుంటాయి. దీనివల్ల అంతిమంగా తమకు లబ్ధి జరుగుతుందని జగన్‌ వర్గం భావిస్తోంది.

జగన్‌తో పోరాడి రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు ఇలా అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ లోగా 118 కోట్ల ‘వెల్లడిరచని ఆదాయం’ వివరాలు చెప్పాలని ఆదాయ పన్ను శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం, సైకిల్‌ పార్టీ వర్గాలకి మింగుడు పడని పరిణామం. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం అండ లేకపోతే చంద్రబాబు మరింత చిక్కుల్లో పడతారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఆయన వర్గం మీడియా మౌనంగా ఉన్నా, జాతీయ మీడియా, సాక్షి, సోషల్‌ మీడియాలో వైకాపా అనుకూల, తెదేపా వ్యతిరేక గ్రూపులన్నీ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు దగ్గర ఉన్నది కేవలం ఒకే ఆప్షన్‌. తాను అధికారంలోకి వచ్చినా రాకపోయినా, వచ్చే సారి జగన్‌కు పాలనా పగ్గాలు అందకూడదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో సగం అసెంబ్లీ స్థానాలను భాజపాకు పంచడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. అదీ కుదరదంటే, తమ తండ్రీ కొడుకుల భవిష్యత్తుపై ఒకట్రెండు స్పష్టమైన హామీలు తీసుకుని తెదేపాను భాజపాలో విలీనం చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. గతంలో తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపాలో కలిసిపోయినా చంద్రబాబు పెద్దగా స్పందించలేదు. వాళ్లంతా ఇప్పటికీ ఆయనతో ‘టచ్‌’ ఉన్నారు. తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఏ ఆప్షన్‌నూ చంద్రబాబు వదులుకోరని ఆయనతో పరిచయమున్న వాళ్లు చెబుతుంటారు. చూద్దాం ఏ జరుగుతుందో..!

Tags:    

Similar News