‘‘దేశంలో ఏం జరుగుతుందీ.... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతందనే విషయాన్ని చెప్పడానికి నేను ఢిల్లీ వచ్చా. మోదీ విధానాలతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయింది. ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. నాలుగున్నరేళ్లలో మోదీ ఏం చేశారని అడుగుతున్నా. చెప్పిన హామీలను కూడా మోదీ అమలు పర్చలేకపోయారు. రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ యువతను మోసం చేశారు. డిజిటల్ ఎకానమి విషయంలో నేను ఇచ్చిన రిపోర్ట్ ను కూడా అమలు పర్చలేదు. డిజిటల్ ఎకానమీ వల్ల ట్రాన్సాక్షన్, మొబైల్ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని నేను రిపోర్టులో ఇచ్చా. దానిని కాదని రెండు వేల రూపాయల నోటు తెచ్చారు. ప్రజలు ఇబ్బంది పడటం తప్ప పెద్దనోట్ల రద్దుతో ఒరిగిందేమీలేదు. బ్యాంకులు కూడా విశ్వాసాన్ని కోల్పోయాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, జితిన్ మెహతా వంటి వారు తప్పించుకోవడంతో ప్రజలకు బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లింది. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ కూడా సక్రమంగా అమలు పర్చలేదు. పెట్రోలు ధరలు డిసెంబరు 2014లో 63 రూపాయలుంటే, ఇప్పుడు 83 రూపాయలు అయింది. రూపాయి విలువ కూడా పూర్తిగా పతనమయింది. దేశంలో ఏ రైతు సంతోషంగా లేరు.’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీతో చీకటి ఒప్పందం....
‘‘తెలంగాణలో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకుని బీజేపీ చెప్పింది. రాజకీయాల్లో ఇది నైతికమా? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు తీసుకున్నారు. జగన్ అక్రమ కేసుల్లో ఇరుకున్నారు. అటువంటి వారితో పొత్తుకు సిద్ధమయ్యారు బీజేపీనేతలు. అందుకే తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాం. అయినా కూడా బీజేపీ నేతలు చేసిన తప్పులు సరిదిద్దుకోవడం లేదు. నేను వైసీపీ ట్రాప్ లో పడ్డానని ప్రచారం చేశారు. కానీ నేను వైసీపీ ట్రాప్ లో పడలేదు. బీజేపీయే అవినీతి ట్రాప్ లో పడింది. పార్లమెంటులో ప్రధాని నాకంటే కె.చంద్రశేఖర్ రావు మెచ్యూరిటీ ఉందని చెప్పారు.నేను మోదీ కంటే ముందే ముఖ్యమంత్రిని అయ్యా. ఎన్నో సంస్కరణలు చేపట్టా. దీనివల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఈరోజు హైదరాబాద్ జాతీయ స్థాయిలో ప్రధాన నగరమయిందంటే అది నా కృషి వల్లే. నాకు, తెలంగాణ ముఖ్యమంత్రి కి మధ్య ఉన్న విభేదాలను తొలగించాల్సిన ప్రధాని దానిని ఇంకా పెద్దవి చేశారు. ఏపీకి ఇంతవరకూ నిధులు విడుదల చేయలేదు. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చిన నిధులు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకున్నారు. కేంద్రం ఏపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. తెలంగాణ వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి మాకు మాత్రం ఇవ్వలేదు. ’’ఇది వివక్ష కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు.....
‘‘లోటు బడ్జెట్ నిధులను కూడా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు ఇవ్వడం లేదు. విశాఖ రైల్వే జోన్ ను పెండింగ్ లో పెట్టారు. ఆంద్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఇటీవల వచ్చిన తిత్లీ తుఫానుకు దెబ్బతిన్న ప్రాంతాలకు కూడా సాయం చేయలేదు. కనీసం కేంద్ర మంత్రులు కూడా తుఫాను బాధిత ప్రాంతాలకు రాలేదు. అయినా భారతీయ జనతా పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు వచ్చారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత జగన్ పై చిన్న కత్తితో శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేశారు. విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ అధీనంలో ఉంటుంది. తర్వాత సీఐఎస్ఎఫ్ నిందితుడిని ఏపీ పోలీసులకు అప్పగించింది. సంఘటన జరిగిన వెంటనే బీజేపీ నేతలు మమ్మల్ని నిందితులుగా చేసి మాట్లాడుతున్నారు. దాడి జరిగిన వెంటనే జగన్ హైదరాబాద్ వెళ్లారు. ఆ సంఘటన జరిగిన వెంటనే గవర్నర్ డీజీపీని రిపోర్ట్ అడిగారు. బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలల క్రితం శివాజీ అనే వ్యక్తి ఆపరేషన్ గరుడ గురించి చెప్పారు. శివాజీ చెప్పినట్లుగానే ఏపీలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో తమకు వ్యతిరేకులపైన ఐటీ దాడులు జరుపుతున్నారు. మేము బీజేపీతో ఉన్నంతకాలం నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఐటీ దాడులు జరగలేదు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, సీఎం రమేష్, సుజనాచౌదరి ఇళ్లపైనా దాడులు చేశారు. క్రికెట్ మ్యాచ్, ఫిన్ టెక్ సదస్సు జరుగుతున్న సందర్భంలోనే ఐటీ దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఐటీ దాడులు చేస్తారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ పై దాడి ఘటనను......
‘‘ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం తాను అమలు చేయమని అడిగాను. నేను ఎప్పుడైతే బీజేపీని వ్యతిరేకించారో నన్ను వేధిస్తున్నారు. నా పని నన్ను చేసుకోనివ్వకుండా రోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారు. పెట్టుబడిదారులు రాకుండా భయపెట్టేందుకే ఐటీ దాడులు చేస్తున్నారు. జగన్ పై దాడి జరిగిన వెంటనే అందరూ ఒక్కటయ్యారు. గవర్నర్ నా పరిపాలనలో ఎలా జోక్యం చేసుకుంటారు? ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి ఆ ఘటనను వాడుకునేందుకు ప్రయత్నించారు. జగన్ పై దాడికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఎయిర్ పోర్ట్ నా పరిధిలో ఉండదు. బీజేపీ వైసీపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. గవర్నర్ వెంటనే ఢిల్లీకి వచ్చి నివేదికలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ఇటువంటి వాటికి భయపడదు. పార్టీ అధ్యక్షుడు, ప్రధాని ఒకే రాష్ట్రానికి చెందిన వారుంటే మిగిలిన ప్రాంతాలకు న్యాయం జరగడు. ఎక్కడ చూసినా గుజరాత్ అధికారులే. రానున్న రోజుల్లో ఇంకెన్ని దాడులు జరుగుతాయో తెలీదు. అయితే నిజాలు ఎప్పుడూ నిలకడగా ఉంటాయి.’’ అని చంద్రబాబు అన్నారు.