ఆ ఇద్దరిపై బాబు భగ్గుమన్నారు...!

Update: 2018-08-25 03:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన ఆందోళన చెందుతున్నారు. పార్టీ క్రమశిక్షణ గాడి తప్పుతుందని ఆయన సన్నిహిత మంత్రుల వద్ద ఆవేదన చెందారు. ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అసహనాన్ని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పొత్తులపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజానాడిని తెలుసుకునేందుకే ఆయన ఫిల్లర్స్ ను వదులుతారు. చంద్రబాబుకు ఇది ఎప్పుడూ అలవాటే. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే లీకుల ఆధారంగా పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతుంటాయి.

తెలంగాణ విషయాన్ని.....

అందులో భాగంగానే ఇటీవల సీనియర్ నేతలు, మంత్రులతో సమావేశమైన చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు విషయమై ప్రస్తావించారు. అదీ తెలంగాణాకు సంబంధించి మాత్రమే. తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరుగుతుండటంతో ఒంటరిగా అక్కడ బరిలోకి దిగడం కష్టమని భావించిన చంద్రబాబు అక్కడ పొత్తుతోనే వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఏ పార్టీతో పొత్తు ఉంటుందన్నది స్పష్టం చేయలేదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని ఆయన ఆ సమావేశంలో చెప్పారు.

మంత్రులు ఫైర్ అవ్వడంతో.....

అయితే కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధమేనంటూ కథనాలు ప్రచురితమయ్యాయి. నిజానికి చంద్రబాబు గత కొంతకాలంగా కాంగ్రెస్ తో సన్నిహితంగానే ఉంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసమే కాంగ్రెస్ కు కొంత దగ్గరగా జరిగారు. అయితే చంద్రబాబు పొత్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే సీనియర్ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు నిర్ణయం జరిగిపోయినట్లు మాట్లాడారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. తమ కాళ్లు పట్టుకున్నా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ రెస్పాన్స్.....

దీంతో కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ వెంపర్లాడటం లేదని ఆ పార్టీ నేత తులసీరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గతంలో చంద్రగిరిలో చంద్రబాబును అనేకసార్లు ఓడించామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్టీఆర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని మరచిపోదన్నారు. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలవ్వడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాను పొత్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోక ముందే మంత్రులు అలా మాట్లాడటం సరికాదన్నారు. తాను వారిని పిలిపించి మాట్లాడాలనుకుంటున్నట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు.

Similar News