కేసీఆర్ కు బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ..!!

Update: 2018-11-28 02:30 GMT

చంద్రబాబు పై ముప్పేట దాడి చేస్తున్నారు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఎందుకు తిడుతున్నారో అర్ధం కావడం లేదంటూ అమాయకంగా ప్రజలను ఎపి సీఎం ప్రశ్నిచడం చర్చనీయాంశం అవుతుంది. జగన్, పవన్, బీజేపీలపై విరుచుకుపడే బాబు కెసిఆర్, కేటిఆర్ లపై ప్రతిదాడికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణ నేతల విమర్శలను పట్టించుకోకుండా హుందా హుందా అనే బాబు ఏపీలో విపక్షాలపై అలాంటి హుందాతనం ఎందుకు పాటించడం లేదు. అక్కడ వారిపై ఒకలా ఇక్కడి ప్రత్యర్థులపై మరోలా ఆయన వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తుంది.

ఎన్టీఆర్ పార్టీ పెట్టకపోతే కేసీఆర్ ఎక్కడ ...?

గత వారం రోజులుగా బాబు పరువును తాను పెట్టే ప్రతి సభలో తీస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కెసిఆర్. అయితే ఆయన మాటల దాడి పై ప్రతి దాడి చేయకుండా తాను హుందాగా ఉంటానన్న బాబు తాజాగా రెచ్చిపోయారు. గులాబీ బాస్ కి సైకిల్ అధినేత మొత్తానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.తెలుగుజాతి ఐక్యంగా వుండాలని కోరుకోవడం తప్పేలా అవుతుంది. తెలుగుదేశం తెలంగాణ లో ఎందుకని కెసిఆర్ అంటున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించకపోతే కెసిఆర్ ఎక్కడ. ఆయనకు రాజకీయ జీవితం ప్రసాదించింది టిడిపి అన్నది నిజం కాదా ? అని నిప్పులు చెరిగారు చంద్రబాబు. విజయనగరం లో జరిగిన ధర్మ పోరాట సభ పేరుకే కానీ ఆయన ఎపి, తెలంగాణ లలో ఎన్నికలు జరుగుతున్నట్లే రాజకీయ ప్రసంగం చేసుకొచ్చారు.

ఏపీలో తెలంగాణ ఎన్నికల ప్రచారం ...

చంద్రబాబు ఎపి లో జరిగే సభల్లోనూ తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతించాలిసిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ తో జట్టు కట్టి తెలంగాణ లో పోటీ చేస్తూ ఉండటంతో ఇప్పటినుంచి క్యాడర్ కు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా బాబు బ్రెయిన్ వాష్ మొదలు పెట్టారు. కూటమి పెట్టడం తప్పా ... రైటా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ తో కలవడం పై కూడా దేశ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, లోక కళ్యాణం కోసమే ఇదంతా అంటూ చక్కగా సమర్ధించుకు వస్తున్నారు బాబు. పేరుకు ధర్మ పోరాట దీక్షాలైనా అక్కడ తాజా రాజకీయ పరిణామాలపై బాబు మార్క్ ప్రసంగాలతో రాజకీయ వేడి మరింత పెంచుతున్నారు ఎపి చంద్రుడు. తన ప్రసంగాల్లో జగన్, పవన్ లను మోడీని తిట్టిపోసిన తరువాత మిగతా భాగం కెసిఆర్ తిట్ల దండకానికి ప్రతిస్పందన చెప్పుకోవడానికి వినియోగిస్తున్నారు బాబు. మరి ఆయన ఏపీనుంచి చేస్తున్న హెచ్చరికలకు గులాబీ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.

Similar News