తెలంగాణలో ప్రజాకూటమి ఖచ్చితంగా గెలుస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక అవసరమని తెలంగాణ ప్రజలు కూడా గుర్తించారన్నారు. కె.చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ఏపీలోనే అన్నిరంగాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ప్రగతి సాధించామని టీడీపీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణాలో రైతులకు లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని, ఏఫీలో లక్షన్నర వరకూ మాఫీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అన్ని రంగాల్లో తెలంగాణ కంటే....?
అలాగే ఏపీ అన్ని రంగాల్లో తెలంగాణకంటే ముందుందన్నారు. కేసీఆర్ ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు. ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రగతి దిశగా పయనిస్తుందనిచెప్పారు. తెలంగాణాలో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేయలేదని, ఏపీలో మాత్రం వారికి పది వేల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చినట్లు చెప్పారు. ఉపాధిరంగంలోనూ తెలంగాణ కంటే ఏపీ ముందున్నదన్నారు. ఏపీలో పదిలక్షల మందికి ఈ నాలుగున్నరేళ్లలో ఉపాధి కల్పిస్తే, తెలంగాణలోన అందులో సగం కూడా చేయలేదన్నారు. రైతు ఆత్మహత్యలను అరికట్టడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని చంద్రబాబు కోరారు.