అందరూ కలసి రండి.. నేనొక్కడినే
స్కామ్‌లు తప్ప స్కీమ్‌లు తెలియని బాబులు రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు
స్కామ్‌లు తప్ప స్కీమ్‌లు తెలియని బాబులు రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జిత్తులు, ఎత్తులు, పొత్తులతో అందరూ కలసి ముందుకు వస్తున్నారన్నారు. సామాజిక న్యాయం తెలియని పరాన్న జీవులని అన్నారు. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని అన్నారు. తనకు మీడియా బలం లేకపోయినా జన బలం ఉందని జగన్ అన్నారు. తాను పొత్తులపై ఆధారపడడని, తనకు జనంతోనే పొత్తు అని అన్నారు. తనకు కుయక్తులు చేయడం రాదని, అబద్ధాలు చెప్పడం రాదని అన్నారు. తనకు తెలిసిందల్లా ఒక్కటేనని ఏదైతే చెబుతానో అదే చేస్తానని జగన్ అన్నారు. ఇంట్లో మంచి జరిగితేనే తనకు అండగా నిలబడాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా చిలకలూరిపేటకు జగన్ వరాలు ప్రకటించారు. సాగునీటి కోసం 60 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నానని ప్రకటించారు.
ప్రతి రెండు వేల మందికి...
ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డాక్టర్ కోసం మీరు బయటకు పరిగెత్తాల్సిన అవసరం లేదన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో క్యాన్సర్, గుండెజబ్బులతో పాటు దీర్ఘకాలిక రోగాలు కూడా పరిశీలించి వైద్యం నిర్వహిస్తారని తెలిపారు. మండలానికి రెండు పీహెచ్‌సీలను ఏర్పాటు చేసి అందులో ఇద్దరు వైద్యులను కూడా నియమించామన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా ఈ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. పేదల కోసం ఆరోగ్య శ్రీ కోసం వ్యాధుల సంఖ్యను పెంచామని తెలిపారు.
తక్షణ వైద్యం...
పేద వాడికి వైద్యం తక్షణం అందించాలని ఈ కాన్సెప్ట్‌ను తెచ్చామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది కూడా ఇందుకు సహకరించాలని జగన్ కోరారు. విలేజీ క్లినిక్స్ లో 14రకాల సేవలు అందిస్తారని తెలిపారు. వారంతా విలేజ్ క్లినిక్ ఉన్న చోట నివాసం ఉండాలని ఆదేశించామని తెలిపారు. తన తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ కోసం 9 వేల కోట్లు, ఆరోగ్య ఆసరా కింద 900 కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టామన్నారు. గత చంద్రబాబు హయాంలో ఏడాదికి ఆరోగ్య శ్రీకి ఏడాదికి వెయ్యి కోట్లు కూడా ఖర్చు కాలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నాణ్యమైన ఆరోగ్యం అందించాలని ఏడాదికి ఆరోగ్య శ్రీకి మూడు వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
ఆరోగ్య శ్రీ సిఫార్సులను...
వ్యవస్థలో మార్పులు రావాలని తాను అన్ని విధాలుగా ప్రయత్నించానని తెలిపారు. పెద్ద వ్యాధులున్న వారికి విలేజ్ క్లినిక్ నుంచే ఆరోగ్యశ్రీకి వైద్యులు సిఫార్స్ చేస్తారన్నారు. వైద్యులను పెద్ద సంఖ్యలో నియమించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక ఆసుపత్రి ఉన్న రాష్ట్రం ఏపీయేనని జగన్ తెలిపారు. ఆశావర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచిన ప్రభుత్వం కూడా తమదేనని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖకు ఏటా చంద్రబాబు ఎనిమిదివేల కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం 18 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 11 మెడికల్ కళాశాలలు ఉంటే, తమ ప్రభుత్వం 17 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.