తన స్నేహితులను కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు వదలలేదని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు. ఒక తప్పుడు కంపెనీపై వారెంట్ తీసుకు వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు తన ఇంట్లోతో పాటు బంధువులు, స్నేహిుతులు ఇళ్లల్లో సోదాలు జరిపారన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తనపై ఐటీ దాడులు జరిగాయని చెప్పారు. మూడు రోజుల పాటు మానసికంగా తమను ఇబ్బందుల పాలు చేశారన్నారు. మొత్తం 25 చోట్ల సోదాలు జరిపారన్నారు. రిత్విక్ అగ్రిలో తన భార్య డైరెక్టర్ కాకపోయినా ఆమె పేరుతో వారెంట్ తీసుకువచ్చారన్నారు. ఇటువంటి దాడులకు భయపడే ప్రసక్తి లేదని సీఎం రమేష్ మీడియాకు తెలిపారు. తన ఇంట్లో ఐటీ అధికారులకు ఎటువంటి అక్రమ లావాదేవీలకు సంబంధించిన రికార్డులు దొరకలేదని, పారదర్శకంగా ఉన్నామని సీఎం రమేష్ తెలిపారు.