తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు సీఎం రమేష్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సీఎం రమేష్ ఇంట్లో మూడున్నర లక్షల నగదును ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. దీంతో పాటు రిత్విక్ ప్రాజెక్ట్స్ కార్యాలయం నుంచి అధికారులు కొన్ని కీలక ఫైళ్లను తమతో తీసుకెళ్లారు. కాగా తాను నిజాయితీగా వ్యాపారాలు నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ సోదాలు నిర్వహించిందని, కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయాందోళనలకు గురి చేయడానికే ఈ దాడులు జరుగుతున్నాయని సీఎం రమేష్ చెప్పారు.