పాపం.. కామ్రేడ్లు.. ఒకసారి చేజారితే?

కాలం చెల్లిన సిద్ధాంతాలతో వెళితే ఇక ఓటమి తప్ప మరొకటి ఎదురు కాదని త్రిపుర విష‍‍ంలో కమ్యునిస్టులకు అర్థమయి ఉండాలి

Update: 2023-03-02 12:02 GMT

ఏదైనా అంతే... ఒకసారి చేజారి పోయిందంటే ఇక దక్కించుకోవడం కష్టమే. ఎంతో ప్రయాసపడితే కాని గెలుపు పిలుపు వినిపించదు. పాపం.. దేశంలో వామపక్షాలదీ అదే పరిస్థితి. పశ్చిమ బెంగాలన్ ను దశాబ్దకాలం పాటు ఏలింది. ఆ తర్వాత దానికి అక్కడ నిలువ నీడ కూడా దొరకలేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో కనీస స్థానాల కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు ఎన్నికల నుంచి పోరాడుతున్నా ఫలితం లేదు. వామపక్షాలు పూర్తిగా సిద్ధాంతపరమైన పాలన చేస్తాయి. అవినీతి తక్కువ. అదే సమయంలో అభివృద్ధి విషయంలో కూడా అంతే అని చెప్పుకోవాల్సి ఉంటుంది.

పశ్చిమ బెంగాల్‌లో...
ఒకసారి చేజార్చుకున్న వెస్ట్ బెంగాల్ ను ఇక తమ చేతుల్లోకి తీసుకోలేక కామ్రేడ్లు అష్టకష్టాలు పడుతున్నారు. మొన్నటి వరకూ త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాల్లోనైనా దానికి బేస్ ఉందని అందరూ అనుకున్నారు. కేరళలో ఇప్పుడు వామపక్ష పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ అది ఓటు బ్యాంకును చేజార్చుకుంటే మళ్లీ దక్కించుకోవడం కష్టమేనన్నది ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. త్రిపుర సంగతే తీసుకుందాం. త్రిపురలో కొన్ని దశాబ్దాలు వామపక్ష పార్టీ రాజ్యమేలింది. వారికి కంచుకోటగా త్రిపుర రాష్ట్రం నిలిచింది. మాణిక్ సర్కార్ వంటి నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రులు పనిచేశారు.
దశాబ్దాలు పాలించి...
అయినా ఏం లాభం.. 2018లో ఓటమిపాలయిన తర్వాత తిరిగి అక్కడ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. 1978 నుంచి త్రిపురలో 1988 వరకూ వామపక్ష కూటమి పరిపాలించింది. ఆ తర్వాత మధ్యలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించింది. అనంతరం 1993 నుంచి 2018 వరకూ తిరిగి ఎర్రజెండాల నీడలో త్రిపుర ఉంది. మాణిక్ సర్కార్ నాలుగు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మంచి పేరు. అప్పట్లో దేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో కెల్లా అత్యంత తక్కువ ఆస్తి ఉన్న నాయకుడు. జ్యోతిబసు తర్వాత అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కమ్యునిస్టు ముఖ్యమంత్రి ఆయన. జీతం, అలవెన్సులు కూడా పార్టీకి విరాళంగా ఇచ్చేవారు. సాదాసీదా జీవితం. అలాంటి మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని 2018 ఎన్నికల్లో త్రిపుర ప్రజలు కాదనుకున్నారు.
చిన్న రా‌ష్ట్రంలోనూ...
ఇక అప్పటి నుంచి కామ్రేడ్లకు కష్టాలు మొదలయ్యాయి. త్రిపుర ఎన్నికల్లో ఈసారైనా ఖచ్చితంగా గెలుస్తామని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అధికార పార్టీపై వ్యతిరేకత తమను గద్దెనెక్కిస్తుందని నమ్మారు. కానీ ఏం లాభం కామ్రేడ్లు ఈసారి ఎన్నికల్లో 14 స్థానాలకే పరిమితమయ్యారు. అక్కడ తిప్రా మోధీ పార్టీకి 13 స్థానాలు దక్కాయి. బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ లభించింది. దీంతో కొద్దో గొప్పో ఆశ ఉన్న చిన్న రాష్ట్రం త్రిపురను కూడా కామ్రేడ్లు చేజార్చుకున్నట్లే కనపడుతుంది. కొత్త డిమాండ్లు, కొత్త తరహా పాలనవైపు ప్రజలు మళ్లుతున్నారు. ఇప్పటికే కామ్రేడ్లు కూడా కాలానికి అనుగుణంగా మారకపోతే ఇక కాలంచెల్లినట్లే.


Tags:    

Similar News