ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. తెలంగాణలో గెలిచే అవకాశాలు ఉండటంతో ఏఐసీసీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలను సమర్థవంతంగా ఎదురుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ లో కొత్త కమిటీలను నియమించారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న ఇంచుమించు అందరు నేతలకూ కమిటీల్లో అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన నేతలకు కూడా కమిటీల్లో అవకాశం కల్పించారు. అయితే, కమిటీల కూర్పు చూస్తే మాత్రం భారీ కసరత్తు చేసినట్లుగా కనపడుతోంది. దూకుడుగా వ్యవహరించే నేతలకు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బద్ధ వ్యతిరేకులుగా ముద్రపడి ప్రభుత్వాన్ని ఎండగడుతున్న నేతలకు కమిటీల్లో ప్రాధాన్యత దక్కింది.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని...
తెలంగాణలో కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు కనపడుతోంది. గత ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎన్నికలకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఈ విషయాన్ని ఎక్కువగా క్లయిమ్ చేసుకోలేక ఓటమి పాలయ్యింది. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ఛాంపియన్ గా ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు. కేసీఆర్ వాక్చాతుర్యం, దూకుడుగా వ్యవహరించే తత్వం కూడా ఆయన విజయానికి కలిసివచ్చింది. కాంగ్రెస్ మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకోలేక, కేసీఆర్ కి తగ్గట్లుగా ప్రజల్లోకి వెళ్లలేక ఓటమి పాలయ్యింది. గత అనుభవాల దృశ్యా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో జాగ్రత్తగా ముందుకు వెళుతోంది.
కేసీఆర్ వ్యతిరేకులకు పెద్దపీట...
కేసీఆర్ కి తగ్గట్లుగా మాట్లాడేవారికి, కేసీఆర్ విధానాలను ప్రజల్లో ఎండగట్టగలిగిన నేతలకు కమిటీల్లో ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా కేసీఆర్ కి బద్ధవ్యతిరేకిగా ముద్రపడి, కేసీఆర్ వైఖరిని తీవ్రస్థాయిలో విమర్శించే రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రసిడెంట్ గా కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇక కేసీఆర్ కి వ్యతిరేకులుగా ముద్రపడ్డ జగ్గారెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్, దాసోజు శ్రవణ్ కు కన్వీనర్ పదవులు కట్టబెట్టారు. ఇక కేసీఆర్ ను గట్టిగా విమర్శించే పొన్నం ప్రభాకర్, డీకే అరుణలకు కూడా కీలక పదవులు దక్కాయి. చాలా కాలంగా కాంగ్రెస్ నేతలు ఈ కమిటీల నియామకం కోసం ఎదురు చూస్తున్నారు. కమిటీల ఏర్పాటుతో వీరంతా మరింత దుకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే, కమిటీల్లో తమకు సరైన ప్రాధాన్యత లభించలేదని కొంత మంది నేతలు మాత్రం అసంతృప్తితో ఉన్నారు.