తీరిక లేని రాహుల్.. వృద్ధనేతగా మారిపోయారే?

కీలకమైన సమయంలో చేతులెత్తేయడం రాహుల్ గాంధీకి వెన్నతో పెట్టిన విద్య

Update: 2022-01-19 03:04 GMT

కీలకమైన సమయంలో చేతులెత్తేయడం రాహుల్ గాంధీకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన కాంగ్రెస్ భవిష్యత్ నేతగా ఊహించుకున్న వారికి రాహుల్ యాటిట్యూడ్ రుచించడం లేదు. కాంగ్రెస్ సారధిగా ఎన్నికలను సవాల్ గా తీసుకోవాల్సిన రాహుల్ గాంధీ సరైన సమయంలో సైడ్ అయిపోతున్నారేమోనని పిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో ఎన్నికలకు అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి.

పంజాబ్ లో....
పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరోసారి అక్కడ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ నామమాత్రంగానే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం గెలుపు పై కన్నేసింది. కాంగ్రెస్ నుంచి గుంజుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ప్రజాభిప్రాయం ద్వారా సీఎం అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం ఇంకా పిచ్చి చూపులు చూస్తుంది. రాహుల్ గాంధీ పంజాబ్ వైపు చూడలేదు.
మొత్తం సోదరి మీదనే....
ఇక ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను కూడా రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదు. సోదరి ప్రియాంక గాంధీ పైకి అన్నీ తోసేశారు. తనను గత పార్లమెంటు ఎన్నికల్లో ఓడించారన్న కోపం కావచ్చేమో. కానీ పూర్తిగా సోదరి పైనే భారాన్ని మోపారు. ఉత్తర్ ప్రదేశ్ వచ్చే పార్లమెంటు ఎన్నికలకు కీలకం అని తెలిసినా ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. ప్రధాని మోదీ నుంచి అందరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
తీరిక లేనేనా?
కానీ రాహుల్ గాంధీకి మాత్రం తీరిక దొరకడం లేదు. కాంగ్రెస్ కు ఉపయోగపడే సీనియర్లపై చిందులు తొక్కడం తప్ప రాహుల్ కు చేతనయింది ఏందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలకు, క్యాడర్ కు రాహుల్ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా నెల కూడా సమయం లేదు. కానీ రాహుల్ గాంధీకి మాత్రం తీరిక లేదు. దీనిపై పార్టీలోనే రాహుల్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. రాహుల్ ను యువనేత అనాలా? వృద్ధ నేత అనాలా? అన్నది కార్యకర్తలే తేల్చుకోవాలనుకున్నారేమో?


Tags:    

Similar News