పైసా వసూల్...చేతులు ఎత్తేస్తారా...?

Update: 2018-12-27 00:30 GMT

ఎన్నికలు అంటేనే ధన ప్రవాహం. అంగబలం కనిపించాలంటే అర్ధబలం దండిగా ఉండాలి. లేకపోతే ప్రాధమిక స్థాయిలోనే అభ్యర్థిత్వం పక్కన పడేస్తాయి ఏ పార్టీ అయినా. నేటి ధనస్వామ్య యుగంలో నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ధన ప్రవాహమే అన్నది అందరికి తెలిసిందే. నిన్న మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వం ధారపోసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఫలితం దక్కలేదు. సరికదా వెనకే పంచాయితీ ఎన్నికలు వచ్చేశాయ్. దాంతో వీటికి డబ్బెక్కడినుంచి పట్టుకురావాలా అన్న ఆందోళన కాంగ్రెస్ ఇంఛార్జ్ లను వేధిస్తుంది.

వారిదే బాధ్యత ...

నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఇన్ ఛార్జ్ లను అసెంబ్లీ ఎన్నికల్లో నియమించింది కాంగ్రెస్. పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి వారిని గెలిపించి తీసుకురావలిసిన బాధ్యత సంబంధిత ఇంచార్జ్ లపై వుంది. ఇప్పటికే నిన్న మొన్నటి ఎన్నికల్లో సొమ్మంతా ఖర్చు పెట్టి ఘొల్లుమంటూ గోళ్ళు గిల్లుకుంటూ ఉంటే ఇప్పుడు పంచాయితీ ఎన్నికలకు ఎక్కడినుంచి సొమ్ములు వస్తాయని ఆందోళన చెందుతున్నారుట ఇంచార్జ్ లు.

ఉంటారో...ఉండరో....?

పార్లమెంట్ ఎన్నికల వరకు తతంగం అంతా మోయాలి అంటే తమ వల్ల కాదని అంతర్గతంగా వాపోతున్నట్లు పార్టీ వర్గాల్లో వస్తున్న టాక్. మొన్నటి ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లు అధికారపార్టీకి ధీటుగా పైసలు విసిరి ఓటర్లకు ఒక రేంజ్ లో అలవాటు చేసి ఇప్పుడు చేతులు ఎత్తేస్తే క్షేత్ర స్థాయిలో భవిష్యత్తులో కోల్పోయే ప్రమాదం ఉందన్న భయం టి కాంగ్ లో కనిపిస్తుంది. మరోపక్క కష్టపడి గెలిపిస్తే వారు తమ పార్టీలో వుంటారో ఉండరో అన్న అనుమానాల నేపథ్యంలో అయోమయంలో తెలంగాణ కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది. మరి దీనికి అధిష్టానం ఎలాంటి పరిష్కారం కనిపెడుతుందో చూడాలి.

Similar News