ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ ఉల్టా షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా బలం పుంజుకోకముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ పూర్తిగా సన్నద్ధం కాకముందే ఎన్నికలు వచ్చి పడ్డాయి. దీంతో ఆ పార్టీ కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఓ వైపు పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటుతో పాటు పొత్తుల్లోనూ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉండగా అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీకి పెద్దలకు తలనొప్పిగా మారాయి.
రాహుల్ గాంధీ చెప్పినా వినకుండా...
ఎన్నికల కమిటీల నియామకంపై సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి వారు అసంతృప్తితో ఉన్నా బాహాటంగా విమర్శలు చేయలేదు. కానీ, నల్గొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కమిటీల ఏర్పాటును తీవ్రంగా విమర్శించారు. కమిటీల్లో బ్రోకర్లకు స్థానం కల్పించారని, జైళ్లకు వెళ్లి వచ్చిన వారికి పదవులు ఇస్తారా..? అని ప్రశ్నించారు. అంతేకాదు, పీసీసీ ఇంఛార్జి ఆర్.సి.కుంతియా తెలంగాణ కాంగ్రెస్ కు శనిలా దాపురించాడని తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని, మీడియాకు ఎక్కవద్దని అంతకు కొన్ని రోజుల ముందే తెలంగాణ నేతలకు రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. అయినా రాజగోపాల్ రెడ్డి మాత్రం అవేవీ పట్టించుకోకుండా పార్టీ వైఖరిపై విమర్శలు గుప్పించారు.
రెండో షోకాజ్ వచ్చినా...
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకుని షోకాజ్ నోటీసు జారీ చేసి రెండు రోజుల సమయం ఇచ్చింది. దీనికి మూడు పేజీల వివరణను రాజగోపాల్ రెడ్డి పంపించారు. అయితే, షోకాజ్ నోటీసునూ పట్టించుకోని ఆయన మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పార్టీ పెద్దల వైఖరిపై విమర్శలు చేశారు. దీంతో ఆయనకు మళ్లీ షోకాజ్ ఇచ్చి 24 గంటల్లో వివరణ కావాలని పార్టీ అడిగింది. దీనికి రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు. తాను ఇవ్వాల్సిన వివరణ ఇప్పటికే ఇచ్చేశానని స్పష్టం చేశారు. దీంతో పీసీసీకి ఈ వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని అంతుచిక్కడం లేదు. క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా ఉన్నా ఆయనపై చర్యలు తీసుకునే ధైర్యం ఇప్పుడు చేసే అవకాశం కనిపించడం లేదు.
బలమైన నేతగా ఉండటంతో...
రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై జానారెడ్డి, షబ్బీర్ అలీ వంటి ముఖ్య నేతలు క్రమశిక్షణ కమిటీకి సూచనలు చేశారని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా క్యాడర్ ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరిపై చర్యలు తీసుకుంటే ఎన్నికల వేళ పార్టీకి అనవసర తలనొప్పే అని చెప్పారట. కేవలం ఒక వార్నింగ్, ఒక సారీతో ఈ వ్యావహారాన్ని వదిలేయాలని భావిస్తున్నారు పార్టీ ముఖ్యనేతలు. రాజగోపాల్ రెడ్డి ఇంతకుముందు భువనగిరి ఎంపీగా, ప్రస్తుతం నల్గొండ ఎమ్మెల్సీగా ఉన్నందున ప్రత్యేకంగా అన్ని నియోజకవర్గాల్లో తన క్యాడర్ ను తయారుచేసుకున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ఆయనైతే టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక భువనగిరి బాధ్యతలు కూడా ఆయన తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లోరాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుని రిస్క్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ కనిపించడం లేదు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కల్పించుకుని ఈ విషయాన్ని పట్టించుకోవద్దని కోరినట్లు సమాచారం. మొత్తానికి రాహుల్ గాంధీ ఆదేశాలను ఉల్లంఘించినా చర్యలు తీసుకోవడం లేదంటే నిజంగానే ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మరీ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా ఇలాగే షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు ఏమైందో కూడా ఎవరికీ తెలియదు మరి.