హోమం.. యాగం...వీసీ వింత నిర్ణయం
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సిలర్ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది
యూనివర్సిటీలంటే విద్యాబోధన జరగాలి. కానీ అక్కడ యాగాలు నిర్వహిస్తామంటే ఎలా? శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సిలర్ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. అనంతపురంలోని ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు రాష్ట్రమంతటా హాట్ టాపిక్ గా మారింది. యూనివర్సిటీలో హోం చేయాలని వైస్ ఛాన్సిలర్ నిర్ణయం తీసుకున్నారు. అంతటితో వీసీ ఆగలేదు. హోమానికి అయ్యే ఖర్చును చందాల రూపంలో వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏకంగా ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
యాగానికి అయ్యే ఖర్చు...
ఈ సర్క్యులర్ లో యాగానికి అయ్యే ఖర్చు భరించడం కోసం టీచింగ్ స్టాఫ్ ఒక్కొక్కరు ఐదు వందల రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్ వంద రూపాయలు ఇవ్వాలని వైస్ ఛాన్సిలర్ పేర్కొన్నారు. వీలయితే అంతకంటే ఎక్కువగా ఇవ్వాలని కూడా కోరారు. ఈ నెల 6వ తేదీన ఈ సర్క్యులర్ జారీ అయింది. ఇది వివాదాస్పదమయింది. ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతియోగం నిర్వహిచండానికి వీసీ చేసిన ప్రయత్నం వికటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చందాలను వసూలు చేయడానికి ఏకంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ను నియమించారు.
25 మంది చనిపోవడంతో...
అయితే ఈ యాగాన్ని నిర్వహించడానికి గల కారణాలను కూడా వైస్ ఛాన్సిలర్ చెబుతున్నారు. వరస మరణాలు యూనివర్సిటీలో సంభవించడంతో ఈ యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. వరసగా 25 మంది సిబ్బంది చనిపోయారు. వరసగా చనిపోతుండటం, మిగిలిన వారు భయాందోళనలకు గురి అవుతుండటంతో శాంతిహోమం చేయాలని వైస్ ఛాన్సిలర్ నిర్ణయించారు. ఉద్యోగుల మరణాలను ఆపడానికే తాను మృత్యుంజయ హోమం, శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించినట్లు వైస్ ఛాన్సిరల్ చెబుతున్నారు.
విద్యార్ధి సంఘాల ఖండన...
అయితే దీనిపై విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే వీసీ, రిజిస్ట్రార్ లు తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏదైనా అలాంటి ఆలోచనలు ఉంటే యూనివర్సిటీ బయట చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని, క్యాంపస్ లో నిర్వహించడమేంటని కొందరు తప్పుపడుతున్నారు. తమ నిర్ణయాలను ఉపసంహరించుకోకపోతే హోమాలను అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.