ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని అవినీతిని సీబీఐకి ఫిర్యాదు చేస్తానని వైసీపీ మైలవరం నియోజకవర్గ కన్వీనర్ వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. దేవినేనిపై ఆయన ఫైరయ్యారు. ఒకవైపు తెలంగాణలో మంత్రి హరీశ్ రావు చిత్తశుద్ధితో ప్రాజెక్టులు పూర్తవ్వడానికి కృషి చేస్తుంటే ఇక్కడ దేవినేని ఉమ మాత్రం కమీషన్ల కోసం ప్రతి సోమవారం పోలవరం వెళ్లి వస్తున్నారన్నారు. కాగ్ నివేదిక దేవినేని బండారం బయటపెట్టినా దానిపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. పోలవరం, పట్టిసీమలో కోట్లాది రూపాయలు తినేసిన ఉమ డ్రామాలాడుతున్నారు. పైగా పోలవరం చీఫ్ ఇంజినీర్ రమేష్ బాబు తెలంగాణ వ్యక్తి అని, ఆయనకు అంత పెద్ద ప్రాజెక్టును ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఆయనకు అనుభవం లేదన్నారు. పోలవరం అవినీతిపై వచ్చే సోమవారమే సీబీఐకి ఫిర్యాదుచేస్తానని, తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ అప్పగిస్తానని ఆయన చెప్పారు.