సీనియర్ నేత డి.శ్రీనివాస్ నేడు సొంత గూటికి చేరుకోనున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. డి.శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత కొంతకాలగా ఆయన టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్నారు. తనపై కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత నేతృత్వంలో కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. డీఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాసి దాదాపు నాలుగు నెలలకు పైగానే అవుతుంది.
అపాయింట్ మెంట్ ఇవ్వక.....
అయితే కేసీఆర్ డీఎస్ పై ఎటువంటి చర్య తీసుకోలేదు. అంతేకాకుండా డిఎస్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమైన డీఎస్ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. డీఎస్ తో పాటు గజ్వేల్ టీఆర్ఎస్ నేత నర్సారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. డీఎస్ పార్టీని వీడటం తమకు ఆశ్చర్యం కల్గించడం లేదని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కొంతకాలంగా కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారన్న విషయాన్నే తాము కేసీఆర్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమైపోయింది.