మనసు మార్చుకున్నారా?

ఈటల రాజేందర్ తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. అయితే ఆయన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది

Update: 2023-04-24 03:55 GMT

బీజేపీ నేత ఈటల రాజేందర్ తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. అధినాయకత్వం ఆదేశిస్తే తాను కేసీఆర్‌పై పోటీకి దిగేందుకు సిద్ధమన్నారు ఈటల. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఏడు సార్లు గెలుపొందారు. ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు అన్నీ కలిపితే ఆయనకు నియోజకవర్గంలో ఎంత గ్రిప్ ఉందో ఇట్టే అర్థమవుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గం ఈటల రాజేందర్‌కు కంచుకోట వంటిది. అక్కడ పార్టీల కన్నా ఈటల అంటే అభిమానం ఎక్కువగా ఉన్నవారు కనిపిస్తారు.

ఉప ఎన్నికలో...
అలాంటి నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలోనూ ఈటల విజయం సాధించారు. అధికార బీఆర్ఎస్ ఎంతగా ప్రయత్నించినా గెలవలేక పోయింది. బీసీ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ను బరిలోకి దింపినా చివరకు విజయం ఈటలదే అయింది. హోరా హోరీగా సాగిన పోరులోనూ ఈటల ఉప ఎన్నికల్లో 20 వేల మెజారిటీతో గెలుపొందారు. అక్కడ కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ కేసీఆర్ చేయని ప్రయోగం లేదు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణను పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న పాడె కౌశిక్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆయనను కూడా శాసనమండలి కి పంపారు. పెద్దిరెడ్డిని ఒక్కడినే పదవులకు దూరం పెట్టినా ఆయనకు కూడా పదవి దక్కుతుందని హామీ ఇచ్చారు. దళితబంధు పథకాన్ని అక్కడి నుంచే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినా ఫలితం దక్కలేదు.
వందల కోట్లు పెట్టినా...
వందల కోట్లు ఉప ఎన్నిక సందర్భంగా ఖర్చయినా కూడా ఈటల రాజేందర్‌ను ఓడించలేక పోయారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార బీఆర్ఎస్‌ను ఒకింత రాజకీయంగా అప్పట్లో ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. అటువంటి నియోజకవర్గాన్ని వదులుకుని ఈటల రాజేందర్ గజ్వేల్ నియోజకవర్గానికి ఎందుకు వస్తారన్న చర్చ మొన్నటి వరకూ జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఆలోచన ఈటల విరమించుకున్నారని చెబుతున్నారు. తిరిగి ఆయన హుజురాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ అధినాయకత్వం కోరినా తాను హుజూరాబాద్ నుంచే పోటీ చేస్తానని చెప్పాలని ఈటల రాజేందర్ డిసైడ్ అయ్యారంటున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.
కౌశిక్ రెడ్డి కావడంతో...
దాదాపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గడపతో ఈటలకు పరిచయం ఉంది. అది వదులుకోవడం మూర్ఖత్వం అవుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదో సారి అసెంబ్లీలోకి వరసగా కాలు మోపాలంటే హుజూరాబాద్ నియోజకవర్గం బెటర్ అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దానికి తగ్గట్లు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం కూడా ఆయన ఆలోచనలో మార్పు తెచ్చిందంటున్నారు. గెల్లు శ్రీనివాసయాదవ్‌‌కు నామినేటెడ్ పోస్టు ఇచ్చారు. అక్కడ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి టిక్కెట్ కేసీఆర్ కన్ఫర్మ్ చేశారంటున్నారు. ఇటీవల ఆ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కూడా కౌశిక్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరడంతో ఆయనకు టిక్కెట్ అని తేలిపోయింది. కౌశిక్‌ రెడ్డి అయితే తన గెలుపు సులువు అని ఈటల భావిస్తున్నారు. దీంతో ఈటల తిరిగి వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.


Tags:    

Similar News