రేవంత్ రెడ్డిపై రుద్దుతున్నారుగా

హుజూరాబాద్ లో కాంగ్రెస్ దారుణ ఓటమి తర్వాత కూడా ఏమాత్రం మార్పు రాలేదు. ఢిల్లీకి పిలిపించి వివరణ కోరాలని ప్రయత్నించింది.

Update: 2021-11-14 14:12 GMT


హుజూరాబాద్ లో కాంగ్రెస్ దారుణ ఓటమి తర్వాత కూడా ఏమాత్రం మార్పు రాలేదు. ఢిల్లీకి పిలిపించి మరీ నేతలను వివరణ కోరాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించింది. వార్ రూమ్ లో కూర్చోబెట్టి చర్చించింది. కానీ హూజూరాబాద్ ఫలితం మాట ఎలా ఉన్నా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని చెప్పాలి. ఎవరి వాదన వారిదే. ఎవరో ఒకరిపై నెపం పెట్టాలన్న నేతల ప్రయత్నం ప్రతి కదలికలో కన్పించింది.
ఆయనే టార్గెట్...
రేవంత్ రెడ్డి టార్గెట్ గా కొందరు అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ లో 2018 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో 60 వేల ఓట్లు వచ్చిన కాంగ్రెస్ కు మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మూడు వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇందుకు కారణాలపై లోతైన అధ్యయనం చేసుకుని తప్పులు సరిదిద్దుకోవాల్సిన నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కన్పించింది. సీరియస్ గా చర్చించాల్సిన అంశాన్ని ఢిల్లీకి వెళ్లి కామెడీ చేసి వచ్చారు.
ఓటమికి గల కారణాలు....
నిజానికి హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థి లేరు. అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి పార్టీ వీడివెళుతున్నా పట్టించుకోలేదు. పైగా అతనిని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు కాంగ్రెస్ తొలి నుంచి సీరియస్ గా హుజూరాబాద్ ఉప ఎన్నికను తీసుకోలేదు. అందుకు అభ్యర్థి ఎంపిక ఉదాహరణ. చివరి నిమిషం వరకూ అభ్యర్థిని ప్రకటించకపోవడం, ఆఖరుకు స్థానికేతరుడిని ఎంపిక చేయడం కూడా ఘోర ఓటమికి ఒక కారణంగా చెబుతున్నారు.
సీన్ లేదని.....
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి నుంచి సీన్ లో లేదన్న సంకేతాలను పంపారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా డీలా పడింది. అక్కడ పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉందన్న ప్రచారం కూడా కాంగ్రెస్ ను చావుదెబ్బ తీసింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిని రేవంత్ రెడ్డిపై రుద్దేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా ఎవరు ఉన్నా కలసి కట్టుగా పనిచేయకుంటే హుజూరాబాద్ ఫలితమే అంతటా రిపీట్ అవుతుందని చెప్పక తప్పదు.



Tags:    

Similar News