Tirumala : నిజంగా అదే జరిగితే అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది?
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశమై అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో రెండు మూడు గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశమై అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో రెండు మూడు గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం. మరి దాని సాధ్యాసాధ్యాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. రోజుకు 70 నుంచి ఎనభై వేల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా…
తిరుమల శ్రీవారికి కేవలం ఏపీలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారు. అందుకే నిత్యం తిరుమల కొండ భక్తులతో కిటికిటలాడిపోతుంటుంది. క్యూ లైన్ లు కూడా బయట వరకూ విస్తరించి ఉంటాయి. శుక్ర, శని, ఆదివారాల్లో అయితే భక్తుల సంఖ్య మరింత రద్దీగా ఉంటుంది. ప్రసాదాల కౌంటర్ నుంచి అన్న ప్రసాదాల సత్రం వరకూ ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తుంటారు. అన్ని ప్రాంతాల ప్రజలు తరలి వస్తుండటంతో అందరికీ శ్రీవారి దర్శనం కల్పించాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది.
రెండు మూడు గంటల్లోనే…
అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్టు రెండు మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని నిర్ణయించారు. దీనికి అందరూ సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే.. రెండు మూడు గంటల్లో దర్శనం పూర్తి అయితే ఇక అంతకు మించి కాావాల్సింది ఏముంది? అయితే దీని సాధ్యాసాధ్యాలపై బోర్డు డైరెక్టర్లు, టీటీడీ అధికారుల్లోనే చర్చ జరుగుతుంది. సాధారణ భక్తులకు సత్వరం దర్శనం కల్పించాలన్న ఉద్దేశ్యం మంచిదే అయినా అనేక ఆటంకాలు దీనికి అవరోధంగా మారనున్నాయి.
సిఫార్సు లేఖలు?
ముందుగా బుక్ చేసుకున్న వారు, వీఐపీల నుంచి సిఫార్సు లేఖలు తీసుకు వచ్చిన వారు కూడా ఎక్కువ మంది తిరుమలలో నిత్యం కనిపిస్తుంటారు. సిఫార్సు లేఖలకు సరైన ప్రయారిటీ ఇవ్వకపోతే అది రాజకీయంగా చర్చకు దారి తీసే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతుంది.ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిఫార్సులకు విలువ లేకపోతే ఎలా అన్న ధోరణిని నేరుగా ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించే అవకాశముంది. అయితే వీటన్నింటిని అధిగమించడం బోర్డు ఛైర్మన్ తో పాటు సభ్యులకు కూడా సవాల్ వంటిదే. టీటీడీ అధికారులు కూడా ఇందుకు కొంత ఇబ్బంది పడే అవకాశముంది. మరి నూతన పాలకమండలి రెండు, మూడు గంటల్లో ఎలా దర్శనం కలిగిస్తుందన్నది అందరికీ ఆసక్తి కలిగించే అంశమే.