ఈసారి జగన్ బొమ్మ పనిచేయదా?
అధికారంలోకి రాకముందు జగన్ పై అంచనాలు ఒకలా ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మారే అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయి.
వైఎస్ జగన్ తాను అనుకున్నది కుండబద్దలు కొట్టేస్తారు. వైసీపీ అధినేతగా మరోసారి ఆయన అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. సరే ఫలితం ఎవరూ ముందుగా చెప్పలేరు. ప్రయత్నం అయితే ఉండాలి. కేవలం జగన్ గాలిలో గెలిచామని ఈసారి కూడా అదే తరహాలో గెలుస్తామని భావిస్తే పుట్టి మునిగినట్లే. ఆ విషయం కొందరు ఎమ్మెల్యేలకు తెలియక పోయినా జగన్ కు స్పష్టంగా తెలుసు. అధికారంలోకి రాకముందు జగన్ పై అంచనాలు ఒకలా ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మారే అవకాశాలు అదే స్థాయిలో ఉంటాయి.
బొమ్మ పనిచేయకపోయినా...
జగన్ బొమ్మ ఈసారి పనిచేయకపోవచ్చు. వైసీపీ గుర్తు కొంత మేరకే పనిచేయవచ్చు. పథకాల పంపిణీ కూడా కొంత వరకూ పనిచేస్తుంది. పూర్తిగా ఎమ్మెల్యేలపైనే ఆధారపడి ఉంటుంది. వారికి జనంలో ఉన్న సానుకూలత, సదభిప్రాయాన్ని బట్టి ఓటరు ఎవరికి వేయాలన్నది నిర్ణయించుకుంటారు. అప్పుడే వైసీపీని రెండోసారి విజయం వరిస్తుంది. దీంతో ఎమ్మెల్యేల పనితీరుపైనే జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎప్పటికప్పడు నివేదికలను తెప్పించుకుని వారిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తరచూ వారికి టాస్క్ లు ఇస్తూ వారిని జనం వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.
గడప తొక్కని....
రెండేళ్లు కరోనా కారణంగా జనానికి వైసీీపీ ఎమ్మెల్యేలు దూరమయ్యారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో గత ఆరు నెలలుగా జనం తమ ఎమ్మెల్యే కోసం వెదుకుతున్నారు. అందుకోసమే జగన్ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ముందు పెట్టారు. ఎమ్మెల్యేలు ఎలా ఈ కార్యక్రమానికి హాజరవుతుందీ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈరోజు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సమీక్ష చేయనున్నారు. తాను గత రెండు సమావేశాల్లో చెప్పినప్పటికీ కొందరు ఎమ్మెల్యేల పనితీరు మారకపోవడంపై జగన్ సీరియస్ గానే ఉన్నట్లు తెలిసింది.
మంత్రులకూ వార్నింగ్?
వారికి ఈరోజు గట్టిగానే క్లాస్ పీకే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడప తొక్కని ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారని గుర్తించారు. ఐ ప్యాక్ టీంతో సర్వేలు చేయించి ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయాన్ని కూడా తెప్పించుకున్నారు. ఈ సమావేశంలో మూడు నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను జగన్ ఎమ్మెల్యేలు, మంత్రుల ముందుంచే అవకాశాలున్నాయి. మంత్రుల పనితీరుపైన కూడా ఆయన సీరియస్ గానే ఉన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆయన స్పష్టం చేశారు. కొందరు మంత్రులను మార్చక తప్పదని కూడా ఈ సమావేశంలోనూ వెల్లడిస్తారని అంటున్నారు. దీంతో ఈరోజు జరిగే సమావేశంలో జగన్ నోటి నుంచి ఎవరి పేరు వినపడుతుందోనన్న టెన్షన్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో నెలకొని ఉంది.