Chandrababu : త్వరలోనే యువతకు గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు.. నేరుగా వారి ఖాతాల్లోకే

ఆంధ్ర్రప్రదేశ్్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరసగా అమలు చేసుకుంటూ వెళుతుంది.

Update: 2024-07-19 04:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరసగా అమలు చేసుకుంటూ వెళుతుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువతకు చెప్పినవి చెప్పినట్లుగా వెంటనే అమలు చేసేందుకు సిద్ధమవతుంది. అందులో భాగంగా ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు నాలుగు వేల రూపాయల పింఛను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా కాంటిన్లు వంటివి అమలు చేసింది. అయితే తాజాగా నిరుద్యోగ యువతకు చెప్పిన హామీని అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమయిందని తెలిసింది. ఈ మేరకు ఆర్థిక శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో లెక్కతీసే పనిలో ఉన్నారు.

నిరుద్యోగ భృతి...
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిరుద్యోగులకు ప్రతి నెల భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.నెలకు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. అయితే ఈ పథకాన్ని వీలయినంత త్వరగా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారు? వారికి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ అవసరమవుతుందన్న దానిపై కసరత్తుచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాల వారీగా నిరుద్యోగ యువత వివరాలను తెప్పించుకుని వారికి త్వరలోనే నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నారు.
అర్హతలివేనట...
అయితే ఇందుకోసం అర్హతలు కూడా టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు కావడంతో త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏపీకి చెందిన వారై ఉండాలని, 22 నుంచి 35 ఏళ్ల వయసులోపు ఉండాలి. ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలని అర్హతలుగా నిర్ణయించినట్లు తెలిసింది. అర్హులైన వారికి నెలకు ఇతర మార్గాల ద్వారా పదివేల రూపాయలకు మించి రాకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉండాలని అర్హతలుగా నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసి యువతకు మేలు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారని తెలిసింది.


Tags:    

Similar News