విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై హత్యాయత్నం చివరికి గవర్నర్ నరసింహన్ వైపు టర్న్ అయినట్లు కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర నుంచి మంత్రులు వరకూ గవర్నర్ నరసింహన్ మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన వెంటనే గవర్నర్ నరసింహన్ ఏపీ డీజీపీకి ఫోన్ చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. దీన్ని చంద్రబాబు, మంత్రులు తప్పుపడుతున్నారు. తాము ఇక్కడ అధికారంలో ఉన్నామని, తమను సంప్రదించకుండా గవర్నర్ డీజీపీని ఎలా ఆరా తీస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
తొలిసారి నేరుగా విమర్శలు......
గవర్నర్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం ఆరోపించారు. గవర్నర్ పై తొలిసారి చంద్రబాబు విమర్శలకు దిగడం గమనార్హం. గవర్నర్ నరసింహన్ కావాలనే డీజీపీకి ఫోన్ చేసి కేంద్రానికి తప్పుడు నివేదికలు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్నది టీడీపీ నేతల ఆరోపణ. గవర్నర్ పాత్రపై త్వరలోనే దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గవర్నర్ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండటంతోనే.....
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజు కలెక్టర్ల కాన్ఫరెస్స్ లో ఉండటంతోనే గవర్నర్ డీజీపీకి నేరుగా ఫోన్ చేయాల్సి వచ్చిందన్నది గవర్నర్ కార్యాలయం సిబ్బంది అంటున్నారు. ఏపీ ప్రతిపక్ష నేతపై దాడి జరిగిందని తెలిసిన వెంటనే గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి వివరాలను కనుక్కోవడం తప్పు ఎలా అవుతుందని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు గవర్నర్ ను లాగారని పలువురు అభిప్రాయపడుతున్నారు. హత్యాయత్నం ఘటనను చంద్రబాబు నాటకంగా అభివర్ణించడంపై పలువురు మండిపడుతున్నారు.