Rain Alert : ఏపీకి భారీ వర్ష సూచన.. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2024-10-12 03:17 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉండటంతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడనుందని తెలిపింది. ఈ నెల 13 నుంచి పదిహేను తేదీల మధ్యలో ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 15న తమిళనాడులో తీరం దాటే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే వర్షాలతో విసిగిపోయి ఉన్న ఏపీ ప్రజలకు మరోసారి వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక చిరాకు తెప్పిస్తుంది.

ఈ ప్రాంతాల్లో...
ఎడతెరరిపి లేని వర్షాలతో ఏపీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనానికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నుంచి పదహారో తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనేక చోట్ల ఈదురుగాలులు కూడా వీస్తాయని, గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని పేర్కొంది.
తెలంగాణలోనూ...
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ ఈ ప్రభావంతో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 30 నుంచి నలభై కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.


Tags:    

Similar News