షా.. చెప్పి వెళ్లింది... అదేనట.... వారు బలపడటానికి వీల్లేదట
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు తిరుపతి పర్యటన ముగిసింది. ఆయన చివరి రోజున పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు తిరుపతి పర్యటన ముగిసింది. ఆయన చివరి రోజున పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు పార్టీ నేతలు బీఎల్ సంతోష్, శివప్రకాష్ లు కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా కర్ణాటకలో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఎక్కువగా చర్చించినట్లు చెబుతున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తర్వాత రాజకీయ పరిస్థితులపై అమిత్ షా నేతలను ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఏపీ నేతలతో....
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ నేతలతోనూ అమిత్ షా సమావేశమయ్యారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ , రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ప్రత్యేకంగా అమిత్ షా సూచనలు చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై వ్యతిరేకంగా పోరాడాలని ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీని ప్రధమ శత్రవుగా చూడాలని కూడా అమిత్ షా అన్నట్లు సమాచారం. జనసేనతో కలసి కార్యాచరణను రూపొందించుకోవాలని ఆయన చెప్పారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు....
అయితే ఇందుకు కారణం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత ఎక్కువగా బీజేపీ, జనసేనలు తెచ్చుకుంటే అంత లాభమని అమిత్ షా భావనగా ఉంది. అంటే అమిత్ షా వ్యాఖ్యలను బట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓటును ఎక్కువ శాతం బీజేపీ, జనసేనలు తెచ్చుకునేలా కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీని పరోక్షంగా నష్టపర్చడం కోసమేనని పార్టీలో ఒక వర్గం అప్పుడే విశ్లేషణకు దిగింది.
వారికి గౌరవం ఇవ్వాలని...
దీంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు గౌరవం ఇవ్వాలని అమిత్ షా సూచించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్ లు పార్టీలో యాక్టివ్ కావాలని సూచించారని తెలుస్తోంది. ఏపీలో బీజేపీ బలోపేతం కాకపోయినా, టీడీపీ బలహీనంగానే ఉండేలా అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు కన్పిస్తుందని ఒక వర్గం బీజేపీ నేతలు తమకు అనుకూలంగా అన్వయించుకుంటుంది. మొత్తం మీద ఏపీ రాజకీయాలను అమిత్ షా పెద్దగా సీరియస్ గా చూడలేదని, ఆయన ఎక్కువగా కర్ణాటక పార్టీ పరిస్థితిపైనే ఎక్కువగా చర్చించారని సమాచారం.