హైదరాబాద్ సిటీ గుండెలపై.. అదో చెరగని నెత్తుటి మరక. భయంకర మారణహోమానికి చేదు జ్ఞాపకం. గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ పై ఉగ్రదాడి సృష్టించిన అరాచకానికి.. 11 ఏళ్లు. అయినా… ఆ విషాదం మిగిల్చిన గాయం.. ఇప్పటికీ భాగ్యనగరాన్ని నీడలా వెంటాడుతూనే ఉంది. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం… ప్రశాంత భాగ్యనగరంలో నెత్తుటేరులు పారాయి. 2007లో పంద్రాగస్టు సంబరాలు చేసుకున్నాక సరిగ్గా పది రోజులకు… సాయంత్రం ఆరున్నర గంటలకు జరిగిన అరాచకం కోఠీలోని గోకుల్ ఛాట్ సెంటర్ తో పాటు.. లుంబినీ పార్క్ లో బాంబు పేలుళ్లు నగరంలో భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. 42 మంది కుటుంబాల్లో తీరని విషాదం నింపాయి. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. 42 మంది ఈ పేలుళ్లకు బలైతే.. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. లుంబినీ పార్క్ పేలుడులో 9 మంది.. గోకుల్ చాట్ బ్లాస్ట్ లో 33 మంది చనిపోయారు. మరోవైపు.. అదే రోజు సిటీలో విస్తృత తనిఖీలు చేసిన పోలీసులు.. ఏకంగా 19 బాంబులు కనిపెట్టారు. ఇవి కూడా పేలి ఉంటే… మహా దారుణ విషాదం… భాగ్యనగరాన్ని మరింతగా కుంగదీసేదే.
మక్కా మసీద్ ఘటనకు ప్రతీకారంగా...
ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. తుది తీర్పు మరో రెండు రోజులలో వెలువడనుంది. పేలుళ్లకు సంబంధించి మొత్తం ఏడుగురి పేర్లతో కూడిన 1125 పేజీలతో మూడు చార్జిషీట్లను దాఖలు చేశారు పోలీసులు. కేసులో 286 మంది సాక్షులుగా ఉన్నారు. అనీఖ్ షాఫీఖ్, అక్బర్ ఇస్మాయిల్ చౌధురి, అన్సార్ అహ్మద్ షేక్ అనే ముగ్గురు మాత్రం పోలీసులకు దొరికారు. మక్కా పేలుళ్ల తరవాత పోలీస్ కాల్పులకు ప్రతీకారంగా నిందితులు పేలుళ్లు జరిపినట్టు పోలీసులు చెప్పారు. ఘటనలో రియాజ్ భత్కల్ రోల్ ఉందని ముగ్గురు నిందితులు ఒప్పుకున్నారన్నారు. వీరిని ముంబై పోలీసుల అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. అయితే.. పేలుళ్ల మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ అలియాస్ రోషన్ ఖాన్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఇతనితో పాటు.. ప్రధాన నిందితులు ఇక్బాల్ భత్కల్ అలియాస్ మహమ్మద్ భాయ్, ఫారూఖ్ షర్ఫుద్దీన్ తర్కాశ్ అలియాస్ అబ్దుల్లా, మహమ్మద్ సాదిక్ అన్సార్ అహ్మద్ షేక్ అలియాస్ యాసీర్, అమీర్ రజా కాన్ అలియాస్ ముత్తకి పరారీలో ఉన్నారు.
బాధితులకు దక్కని న్యాయం...
ఇక గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లలో చనిపోయిన వారి కుంటుంబీకులకు 5 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 20 వేలు, ఉచిత వైద్యం అని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి పెద్ద చనిపోతే, ప్రభుత్వ ఉద్యోగం అని కూడా అనౌన్స్ చేసింది. అయితే ఘటన జరిగి పన్నెండేళ్లు అవుతున్నా, ఇప్పటికీ బాధితులకు పూర్తి న్యాయం జరగలేదు. వారి మనసుల్లోని ఆ భయానక దృశ్యం ఇంకా ఇప్పటికీ చెదిరిపోలేదు. కనీసం చనిపోయిన వాళ్లను స్మరించడం కోసం స్మతి చిహ్నమైనా నిర్మించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. మరోవైపు.. భద్రతపైనా ప్రజల్లో నమ్మకం తగ్గుతోంది. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా.. సిటీతో లింక్ బయటపడడంపై ఆందోళన ఎక్కువవుతోంది.