మండు వేసవిలో తుపాను .. ఐఎండీ ఏం చెప్పిందంటే
ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు, అతలాకుతలమవుతున్న ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త చెప్పింది ఐఎండీ.
మండు వేసవిలో తుపాను రావడం కొత్తేమీ కాదు. ఇదివరకు మే నెలలో బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడిన సందర్భాలున్నాయి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సుమారు వారంరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు, అతలాకుతలమవుతున్న ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త చెప్పింది ఐఎండీ. మరికొన్నిరోజుల్లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
మే 6వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో తుపాను ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, అది 48 గంటల్లో క్రమంగా అల్పపీడనంగా మారి.. ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలున్నట్లు తెలిపింది. అయితే ఈ తుపాను పయనం ఎటువైపు ఉంటుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ.. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఆయా శాఖల అధికారులను హెచ్చరించింది. తుపాను ప్రభావం ఒడిశాపై ఉంటుందని భావిస్తూ.. సంబంధిత శాఖ అధికారులను అప్రమత్తం చేస్తోంది.
ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు.. సామాన్యుడికి మండే ఎండల నుండి ఉపశమనం లభించినా.. రైతులకు మాత్రం తీరని నష్టం వాటిల్లింది. ధాన్యం కేంద్రాలకు తరలించిన ధాన్యరాశితో పాటు.. కలుగుల్లో పెట్టిన ధాన్యం, మామిడి,మిరప, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.