అనసూయా.. ఇదేం అసూయ
ఛత్తీస్‌ఘడ్ లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ , గవర్నర్ అనసూయల మధ్య విభేదాలు మరింత ముదిరాయి
దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట అక్కడ గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య వార్ నడుస్తుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలే కాదు. ఛత్తీస్‌ఘడ్ కు కూడా పాకింది. ఇక్కడ సయితం గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రిగా మారింది. షరా మామూలే. ప్రభుత్వం పంపిన ఫైళ్లను తొక్కి పంపడం, అధికారులను వివరణ కోరడం, జాప్యం చేయడం వంటివి జరుగుతుండటంతో సహజంగానే ముఖ్యమంత్రులు ఫైర్ అవుతున్నారు. అయితే ఒక్కో రాష‌్ట్రంలో ఒక్కో విధంగా ముఖ్యమంత్రులు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.
నిరసనలు తలో మాదిరిగా...
తెలంగాణలో రాజ్‌భవన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. తమిళనాడులో మంత్రులు గవర్నర్ రవిపై ఫైర్ అవుతున్నారు. కేరళలో అయితే ఏకంగా గవర్నర్ నిర్ణయాలను అమలు చేయకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌ఘడ్ లో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాత్రం గవర్నర్ అనసూయపై నిప్పులు చెరిగారు. గవర్నర్ రాజ్యాంగ పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని సీఎం అన్నారు. రిజర్వేషన్ల సవరణకు జారీ చేసిన రెండు బిల్లులను ఆమోదించకుండా, తిరస్కరించకుండా ఆలస్యం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
భారీ ర్యాలీ చేపట్టి...
బిల్లులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి అంతే తప్ప అలాగే బిల్లులను తన వద్ద తొక్కి పెట్టి కూర్చుండటంపై భూపేష్ బఘేల్ తప్పుపట్టారు. గవర్నర్ వ్యవహార శైలికి నిరసనగా జన్ అధికార్ మహా ర్యాలీని చేపట్టింది. రాజ్యాంగ వ్యవస్థ గవర్నర్ కు స్పష్టమైన బాధ్యతలను నిర్దేశించినా వాటిని విస్మరిస్తున్నారన్నారు. గవర్నర్ అనసూయ ఇవేమీ పట్టించుకోకుండా తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చని, కానీ ఆ బిల్లును ఎందుకు నిలిపేశారని భూపేష్ బఘేల్ ప్రశ్నిస్తున్నారు.