మళ్లీ మొదలయింది

కాంగ్రెస్ లో మాత్రం ఆధిపత్య పోరు నిత్యం జరగాల్సిందే. అదే వారికి కావాల్సింది. అదే వారికి ప్రచారాన్ని తెచ్చిపెడుతుంది

Update: 2022-07-03 03:57 GMT

వివాదానికి పెద్ద కారణం వాళ్లకు అవసరం లేదు. నిత్యం ఘర్షణలు పడుతుండటమే వారి రాజకీయ అవసరంగా కనిపిస్తుంది. ఏదో వివాదంతో నిత్యం వార్తల్లో ఉండటానికి ఇష్టపడతారు తప్పించి పార్టీ పతనాన్ని వారు పట్టించుకోరు. వారే తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అసలు యశ్వంత్ సిన్హాను కలవడమూ.. కలవకపోవడమూ పెద్ద విషయమేమీ కాదు. ఎందుకంటే సాక్షాత్తూ సోనియా, రాహుల్ గాంధీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు. రాహుల్ ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చాలదూ సిన్హాను కలిసినా కలవకపోయినా కాంగ్రెస్ ఓట్లు ఆయనకే నని అందరికీ తెలుసు.

కేసీఆర్ ఆలోచనే వేరు...
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యశ్వంత్ సిన్హా ను ఓన్ చేసుకునే విషయంపైనే వివాదం మొదలయింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండటంతో కేసీఆర్ యశ్వంత్ సిన్హా రాకను పండగలా నిర్వహించారు. లేకపోతే అసలు పట్టించుకునే వారు కారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానిని కాదని, యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకడానికి వెళ్లారంటేనే కేసీఆర్ ప్రయారిటీ అర్థమవుతుంది. కేసీఆర్ గోల్ అంతా బీజేపీని, ఆ పార్టీ కార్యవర్గ సమావేశాల సంబరాల నుంచి డైవర్ట్ చేయడమే. ఇందులో కేసీఆర్ కాంగ్రెస్ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించి ఉండరు.
రేవంత్ హకుం...
కానీ కేసీఆర్ ను కలసిన తర్వాత తాము కలిసేది లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందుగానే ప్రకటించారు. తాము సిన్హా పర్యటనకు దూరంగా ఉంటామని ప్రకటించారు. ఇదే విషయాన్ని ఏఐసీసీకి కూడా చెప్పి ఉండవచ్చు. కానీ నేతలు వింటారా? అసలే ముదురు నేతలున్న పార్టీ కాబట్టి. వీహెచ్ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. రేవంత్ కు ఎక్కడో కాలింది. పార్టీ ఆదేశాలను థిక్కరించిన వారిని బండకేసి కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అసలే టెంపరున్న నేతకదా? ఇక చూడు కాంగ్రెస్ లో మళ్లీ అగ్గి రాజుకుంది. ముఖ్యమంత్రి గా కేసీఆర్ ను కలిసిన వారిని తాము కలవని అనడం కూడా ఒకరకంగా తప్పే. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందన్న విషయాన్ని రేవంత్ కూడా మర్చిపోయినట్లున్నారు.
జగ్గన్న ఫైర్...
వీహెచ్ ని అంటే తనను అన్నట్లుగా ఫీలయిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ పై ఫైర్ అయ్యారు. బండకేసి కొట్టడానికి తామేమైనా పాలేర్లమా? అని ప్రశ్నించారు. రాహుల్ కలిస్తే తప్పు లేనిది వీహెచ్ కలిస్తే ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. పీసీసీ పదవి దిగిపోతే ఎవరూ పట్టించుకోరని రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలే చేశారు. వీహెచ్ కు అసలు ఓటే లేదు. సిన్హాను కలిసిన ఏం మద్దతు ప్రకటించాలని ఆయన వెళ్లారన్నది ఆయన చెప్పరు. అంతే. కాంగ్రెస్ లో మాత్రం ఆధిపత్య పోరు నిత్యం జరగాల్సిందే. అంతం కాని పోరు నడుస్తూనే ఉంటుంది. అదే వారికి కావాల్సింది. అదే వారికి ప్రచారాన్ని తెచ్చిపెడుతుంది. మరి తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికైనా బాగుపడుతుందా? దీనిపై ఇంత రాద్ధాంతం అవసరమా?


Tags:    

Similar News