వారిద్దరిమధ్య పచ్చగడ్డి వేయకుండా ఇప్పుడు భగ్గుమంటుంది. ఇద్దరు రాజ్యసభ సభ్యులు. అయితే ఒకరు బిజెపి ఎంపి మరొకరు టిడిపి ఎంపి. వారే జివిఎల్ నరసింహ రావు, సిఎం రమేష్ లు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా వీరి చుట్టూనే ఫోకస్ పెంచింది. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులకు ముందే మామీద పడిపోతున్నారంటూ, ఇది రాష్ట్రం మీద జరుగుతున్న దాడిగా టిడిపి గగ్గోలు పెంచింది. ఈ లోగా వచ్చిన బృందాలు సిఎం రమేష్ కంపెనీలు, బంధువుల ఇళ్ళపై దాడులు తీవ్రం చేశాయి. ఏమి లేకుండానే అరచి గోలపెట్టే రమేష్ స్వయంగా తనపై సాగుతున్న దాడులకు ఎలా ఊరుకుంటారు తక్షణమే నానా అల్లరి మొదలు పెట్టేశారు.
గట్టిగా ఎదురుదాడి చేస్తున్న జివిఎల్ ...
ఇక ఎంపి జివిఎల్ నరసింహారావు ఒక రేంజ్ లో ఐటి దాడులపై వస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టే మిషన్ లో బిజీ అయ్యారు. జివిఎల్ చేస్తున్న విమర్శలు, ఆరోపణల ధాటికి రమేష్ అదే స్థాయిలో యుద్ధానికి దిగారు. నరసింహారావు దమ్ముంటే డేట్ టైం ఫిక్స్ చేస్తే ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఈ సవాల్ ను స్వీకరించిన జివిఎల్ తక్షణమే స్పందించారు. రమేష్ ఒకే అంటే ఆదివారమే తాను సిద్ధంగా వున్నా అని మీడియా ముందు చర్చించేందుకు రావాలని కోరారు. అయితే ఈ ప్రతిపాదనకు రమేష్ కూడా స్పందించారు. ప్లేస్, టైం ఆయన్నే డిసైడ్ చేసేయమని చెప్పేశారు.
హద్దులు దాటి మరీ ...
ఇక సిఎం రమేష్, జివిఎల్ నడుమ సాగుతున్న మాటల యుద్ధం హద్దులు దాటి మరీ పోతుంది. పదజాలం సైతం ఇరువురు ఘాటుగా వినియోగించేస్తున్నారు. బిజెపి నుంచి జివిఎల్ కి సపోర్ట్ గా ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే ఉంటే టిడిపి లో మాత్రం జిల్లా స్థాయి నుంచి మంత్రుల వరకు బిజెపి పై మాటల దాడి తీవ్రం చేశారు. టిడిపి అధినేతలకు బినామీగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ లు చేస్తూ వేలకోట్ల రూపాయలు రమేష్ అక్రమార్జన చేశారన్నది జివిఎల్ తదితరుల ఆరోపణ. తెలంగాణ లో రేవంత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్సీ కొనుగోలుకు 50 లక్షల రూపాయలు పంపింది, కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు బాబు ఆదేశాలతో రమేష్ నిర్వర్తించారని కమలదళం భావిస్తుంది. ఐటి దాడులతో ఈ లెక్కలన్నీ తేలిపోతాయన్నది వారి అంచనా. అయితే తాను చేసే వ్యాపారాల్లో సంపాదించిన దానికన్నా ఎక్కువే ఆదాయపు పన్ను కట్టానని ఆధారాలతో నిరూపిస్తామని రమేష్ చెబుతున్నారు. గత ఆరునెలల క్రితమే తన సంస్థలపై దాడులు చేశారని గత నెలలో జీఎస్టీ బృందాలు తన సంస్థల్లో ఏమైనా లొసుగులు దొరుకుతాయేమో అని వెతికినట్లు ఆయన వెల్లడించారు. అయితే కొండను తవ్వి వారు ఎలుకను కూడా పట్టుకోలేరనే రమేష్ అంటున్నారు.
ఐటి దాడులు వాడుకుంటున్న గులాబీ పార్టీ ...
ఏపీలో, తెలంగాణ లో జరుగుతున్న ఐటి దాడులను తన ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా వాడుకోవడం మొదలు పెట్టేసింది టీఆర్ఎస్. రేవంత్ రెడ్డి పై, సీఎం రమేష్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడాలని కెటిఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఆదాయపుపన్ను శాఖ దాడులు చేస్తే క్యాబినెట్ సమావేశం నిర్వహించడం విడ్డురమని ఎద్దేవా సైతం చేశారు. ఇలా ఎపి ఐటి దాడులు పెద్ద చర్చకే తెరతీయడం విశేషం.