బాహుబలి తరహా భారీ బడ్జెట్ ...?

Update: 2018-09-30 17:30 GMT

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీది డూ ఆర్ డై పరిస్థితి. దాంతో ప్రచారం ప్రజల్లో హోరెత్తించాలన్నది ఆ పార్టీ వ్యూహం. అందుకోసం ఖర్చు ఎంతన్నా భరించాలని ఫిక్స్ అయ్యింది. రాష్ట్రంలో గెలిచి తీరతామనుకుని లెక్కేసిన 60 నుంచి 70 స్థానాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది హస్తం పార్టీ. ఈ ప్లాన్ అంతా ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న భట్టి విక్రమార్క చూస్తున్నారు.

మూడు హెలికాఫ్టర్లు అద్దెకు .....

అధికారంలోకి రావడానికి అవకాశం వున్న రాష్ట్రంగా తెలంగాణను పరిగణిస్తుంది కాంగ్రెస్. దాంతో అధిష్టానం తరచూ సీన్ లోకి వచ్చి నేతలకు గీతోపదేశం చేస్తూ వస్తుంది. ఎన్నికల ప్రచారానికి తక్కువ గడువు ఉంటుందన్న ఆందోళనతో మూడు హెలికాప్టర్ లు అద్దెకు తీసుకుని రంగంలోకి దిగుతుంది . ఒక హెలికాఫ్టర్ భట్టి విక్రమార్క వినియోగిస్తారు. రెండోవది పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి వాడనున్నారు. ఇక మూడో హెలికాఫ్టర్ అధిష్టానం నుంచి వచ్చేవారికి కేటాయించారు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక కమిటీ.

నిధుల సమీకరణ ఎలా?

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నది నిధుల సమీకరణ. తెలంగాణలో అధికారంలో లేకపోవడంతో నిధుల లేమి ఆ పార్టీని వెంటాడుతోంది. ఫండ్స్ రైజింగ్ కోసం కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అంతేకాదు ఏఐసీసీ నుంచి నిధులు వస్తాయన్న ఆశలు కూడా లేవు. ఎందుకంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీయే నిధుల లేమితో అల్లాడిపోతోంది. అందుకే మీ నిధులు మీరే సమకూర్చుకోమని ఏఐసీసీ నుంచి ఆదేశాలు అందడంతో కాంగ్రెస్ నేతలు అవస్థలు పడుతున్నారు. తామే మళ్లీ అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతూ నిధుల కోసం కాంగ్రెస్ నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Similar News