ఎప్పుడు...ఏమైనా జరగొచ్చట..!!

Update: 2018-11-05 03:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో ఇంకా కాంగ్రెస్ టికెట్లు ఖరారు చేయకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ పార్టీపైనే వుంది. మరికొద్ది రోజుల్లో మహాకూటమి సీట్ల లెక్కలు తేలడంతో బాటు కాంగ్రెస్ టికెట్లు దీపావళి వెళ్ళాకా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆశావహుల ఆగ్రహ జ్వాలలు ఊహించి ముందస్తు బందోబస్తు కూడా ప్రవేట్ గా ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్. గాంధీ భవన్ కు రక్షణ కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా టిడిపి కి కేటాయిస్తారనే ప్రచారం వున్న స్థానాల్లో ఆ స్థానాలు తమకే దక్కుతాయన్న నమ్మకంతో వున్న కాంగీయులు ఇప్పుడు నిప్పులు చెరగడం మొదలు పెట్టేశారు. నెమ్మదిగా మొదలైన ఈ ప్రకంపనలు మరింతగా విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బిక్షపతి వీరంగం ...

శేరిలింగంపల్లి సీటు పై గంపెడాశ పెట్టుకున్న బిక్షపతి యాదవ్ గాంధీభవన్ ముందు ఆందోళన కు దిగారు. ఆయన అనుచరులు చేతులు కోసుకుని కొందరు వంటిపై కిరోసిన్ పోసుకుని మరికొందరు హల్చల్ చేశారు. శేర్ లింగంపల్లి స్థానం టిడిపికి ఇచ్చేశారన్న టాక్ ఈ ఆందోళనకు కారణం అయ్యింది. అయితే దీనిపై స్పందించేందుకు పిసిసి అధ్యక్షుడు అందుబాటులో లేకపోవడంతో సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ సీన్ లోకి దిగి బిక్షపతి ఆందోళనకు తెరదించారు. ఇంకా ఎలాంటి ప్రకటనలు అధికారికంగా ఇవ్వలేదని కనుక ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని వారికి సర్ది చెప్పారు.

టీడీపీ గెలిచిన సీటును.....

ఈ సీటు టిడిపికి వదిలేది లేదని రాహుల్ వద్దే తేల్చి చెబుదామని బిసి సామాజిక వర్గానికి కాంగ్రెస్ అన్యాయం చేయదంటూ హామీనిచ్చారు ఆయన దాంతో బిక్షపతి ఆయన వర్గం ఆందోళన విరమించింది. 2009 లో ఆ స్థానం నుంచి బిక్షపతి గెలిచారు. 2014 లో మాత్రం ఆయన పరాజయం పాలయ్యారు. దాంతో గతంలో టిడిపి గెలిచిన ఈ స్థానాన్ని వారికే పొత్తులో కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బిక్షపతి ముందే ఉద్యమం ప్రారంభించి అధిష్టానం తేడా చేస్తే సహించేది లేదన్న సంకేతాలు పంపారు. మరి హస్తం అధిష్టానం ఏమి చేస్తుందన్నది చూడాలి. మరోవైపు టిక్కెట్లు కేటాయింపు జరిగిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఎప్పుడు...ఏమైనా జరగొచ్చు. భద్రత పెంచినా నిరసనలు పెల్లుబుకుతాయేమోనన్న ఆందోళనలు ఆ పార్టీ నేతల్లో నెలకొని ఉన్నాయి.

Similar News