తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఓటమి నుంచి ఇంకా తేరుకోలేనట్లుంది. ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగి దారుణంగా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఈ నెల 11వ తేదీన ఫలితాలు వెలువడితే ఇప్పటి వరకూ కోమాలో నుంచి బయటకు రాలేదు. పంచాయతీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఇంకా కలుగు నుంచి బయటకు రాకపోవడం క్యాడర్ ను కంగారెత్తిస్తోంది.
ఉత్తమ్ రావడమే....
ప్రధానంగా ఓటమి తర్వాత పీసీసీ అధ్యక్షుడు రెండుసార్లు మాత్రమే గాంధీ భవన్ కు వచ్చారు. ఒకసారి ఓటమిపై సీనియర్ నేతలతో సమీక్ష జరిపిన ఉత్తమ్, మరొకసారి శాసనసమండలిలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేసే సమయంలో గాంధీభవన్ కు వచ్చారు. అంతకు మించి ఓటమి తర్వాత పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు.అసలు నాలుగున్నరేళ్ల నుంచేకాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టింది చాలా అరుదేనని చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు ఓట్లు కుమ్మరించి పెడుతుందని ఆశించి భంగపడ్డారు హస్తం పార్టీ నేతలు.
గడప దాటని సీనియర్లు....
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఇప్పటికే ఏఐసీసీకి నివేదిక పంపారు. అందులో ఓటమికి గల కారణాలను ఆయన చెప్పారు. కానీ తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి? అన్నదే ఇప్పుడు ప్రశ్న. హేమాహేమీలంతా ఓటమి పాలు కావడంతో ఇప్పట్లో వారు కోలుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంటి గడప దాటి కొందరు బయటకు అడుగు కూడా పెట్టడం లేదు. కనీసం పార్టీ ఎందుకు ఓడింది? పార్లమెంటు ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలన్న సమీక్షకు కూడా సీనియర్ నేతలు దిగకపోవడం ఆందోళన కల్గిస్తుందని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల పరిస్థితేంటి?
ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి కేసీఆర్ చేర్చుకున్నా, గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో కొందరు గులాబీ పార్టీ వైపు వెళతారని ప్రచారం జరుగుతున్నా దానిపై స్పందించే వారే కరువయ్యారు. గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేద్దామన్న స్పృహ కూడా సీనియర్ నేతలకు లేదంటున్నారు. సీనియర్ నేతలైన జానారెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, జీవన్ రెడ్డి వంటి వారు కన్పించడమే మానేశారంటున్నారు. ఈ ఓటమికే ఇలా డీలా పడితే రానున్న కాలంలో ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొనాల్సి ఉంటుందోనన్న వ్యాఖ్యలు పార్టీ నేతల నుంచే విన్పిస్తున్నాయి. ఇలాగే కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ సేమ్ ఫలితాలు రిపీట్ అవుతాయన్న కామెంట్స్ గాంధీభవన్ లో విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా సీనియర్ నేతలు గాంధీభవన్ కు రావాలని ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటోంది.