కోలుకుంటుందా...? కుదుటపడుతుందా ...?

Update: 2018-12-31 00:30 GMT

ఓటమి మిగిల్చిన చేదు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్. తమకళ్లెదుట మూడు కీలక ఎన్నికలు వున్న నేపథ్యంలో ఎన్నాళ్లూ ఇంట్లో కూర్చుని బాధ పడతామని భావించిన కాంగ్రెస్ పెద్దలు ఒక్కరొక్కరుగా బయటకు రావడం మొదలు పెట్టారు. పంచాయితీ ఎన్నికలు మొదలు కొని పార్లమెంట్ వరకు వరుసగా ముంచుకొస్తున్న ఎన్నికలను ఏదోరకంగా ఎదుర్కొని పోయినపరువు కొంతయినా దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు గుండె దిటవు చేసుకుని అడుగులు ముందుకు వేస్తున్నారు. వీరందరికి పెద్ద దిక్కుగా టి పిసిసి చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి ఓదార్పు మాటలు చెబుతున్నారు. ధైర్యం నూరిపోయడం మొదలు పెట్టారు.

మనం అందుకే ఓడిపోయాం ...

అటు లీడర్లు ఇటు క్యాడర్లో జోష్ పెంచేందుకు ఎన్నికల పరాజయాన్ని ప్రజల్లో ఎలా చెప్పుకోవాలో క్లాస్ తీసుకుంటున్నారు ఉత్తమ్. కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకోవడానికి ఎన్నికల్లో అవకతవకలు, ఈవీఎం ల ట్యాపరింగ్ అనే ప్రచారం జనంలోకి తీసుకువెళ్లాలని క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఇక్కడితో అయిపోలేదని వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిస్తున్నారు. పోయిన జవసత్వాలు కూడదీసుకుని తిరిగి పోరాటానికి సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ కి గెలుపు ఓటములు లెక్కే కాదన్న స్లోగన్ ముందుకు తెచ్చారు ఉత్తమకుమార్. మరి ఆయన తాజా క్లాస్ లు లీడర్లు , క్యాడర్ పై ఎంతవరకు పనిచేస్తాయో త్వరలోనే తేలనుంది.

Similar News