గందరగోళం లో కాంగ్రెస్ ...?

Update: 2018-09-11 08:00 GMT

ఒక పక్క పొత్తుల వ్యవహారం తేలలేదు. మరో పక్క సొంత పార్టీలో టికెట్ల కోసం పెరుగుతున్న లొల్లి. మరోపక్క ప్రచారంలో దూసుకుపోతున్న అధికారపార్టీ. ఇది తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న అంశం. దాంతో ఎటు పాలు పోక అధిష్టానం ఆదేశాలకోసం వేచి చూడటమే అన్న పనిలో పడింది హస్తం. ఈ వ్యవహారం మరో పక్క క్యాడర్ ను ఆందోళనకు గురిచేస్తుంది. ఎన్నికలకు దమ్ముంటే రావాలంటూ పదేపదే కేసీఆర్ కు సవాళ్లపై సవాళ్ళు విసిరి తీరా ఆ ముచ్చట వచ్చే సరికి చేతులు ఎత్తేసేలా వందేళ్ల కాంగ్రెస్ కి చికాకు కలిగిస్తుంది.

ఇక్కడే తెగడం లేదా ...?

తమ బలం ఎంత వున్నా కానీ మిత్రులు అడుగుతున్న స్థానాలకు బొమ్మ కనపడుతుంది కాంగ్రెస్ కి. తెలుగుదేశం పార్టీ 35 నుంచి 40 సీట్లు, టీజేఎస్ 30 సీట్లు, సిపిఐ 12 సీట్లు కావాలని హస్తం పార్టీపై వత్తిడి తెస్తున్నాయి. వీరికి అన్ని సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ కి మిగిలేవి 40 స్థానాలే కావడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో ఆందోళన పెరిగిపోయింది. మిత్రులకు పొత్తులో అన్ని స్థానాలు ఇవ్వడం అంటూ జరిగితే సొంత పార్టీలో రెబెల్స్ పెరిగిపోతారని పార్టీకి దీనివల్ల నష్టమే తప్ప లాభం ఏ మాత్రం ఉండదని సీనియర్లు గాబరా పడిపోతున్నారు.

కమిటీయే చూసుకుంటుందని.....

దాంతో ఐదుగురు సభ్యులతో ఇప్పటికే ఒక కమిటీని పొత్తుల్లో భాగంగా ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ కేటాయించవచ్చో తేల్చే పని టి పిసిసి అప్పగించింది. ఈ గొడవంతా వదిలి పొత్తు లేకుండా బరిలోకి దిగితే మంచిదన్న వాదన పలువురు మొదలు పెట్టారు. ఇప్పుడే ఇంత గందరగోళం ఉంటే ఇక పొత్తులు కుదిరి సీట్లు ప్రకటించాకా పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయం హస్తం నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

Similar News