కళ్లు తెరవండి...చెవులు మూయండి ..?

Update: 2018-11-23 06:30 GMT

నామినేషన్ల ఘట్టం ముగిసింది. అనూహ్యంగా అన్ని పార్టీల్లో మెజారిటీ రెబెల్స్ అధినేతల మాటలకు చల్లబడి వేసిన అభ్యర్థిత్వాలు వెనక్కి తీసుకున్నారు. దాంతో ప్రధాన పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇప్పుడు అంతా ప్రచారం మీద దృష్టి సారించారు. తమ స్టార్ క్యాంపెయినర్స్ రాక కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యర్థుల బలం, బలహీనతలు లెక్కలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. తాము అనుసరించాలిసిన ప్రచార వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నారు. నువ్వా నేనా అనే రీతిలో సాగనున్న పోటీలో సత్తా చాటాలని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దూకారు.

సోనియా, రాహుల్ సభతో...

తెలంగాణ ఇచ్చింది తామే అని చెప్పుకున్నా కాంగ్రెస్ గత ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవిచూసింది. లీడర్లు, క్యాడర్లు అతివిశ్వాసానికి పోవడానికి తోడు తెలంగాణ కోసం కొట్లాడింది కెసిఆర్ కదా అని భావించి ప్రజలు గులాబీ కి పట్టం కట్టారు. అప్పటినుంచి ఆ ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ తిరిగి ప్రజల్లో పట్టుకోసం నాటి నుంచి నేటివరకు పోరాడుతూనే వుంది. తాజా ఎన్నికల్లో ఈసారైనా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు హస్తం పార్టీ అన్ని అస్త్రాలు సిద్ధం చేసింది. కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అహ్మద్ పటేల్ వంటివారు సీన్ లోకి దిగి రెబెల్స్ ను బుజ్జగించడం గమనార్హం. ఇలాంటి సిత్రాలు ఎన్నో వున్న తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం మోత మోగించేందుకు కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీ శుక్రవారం భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ చేసిన కృషి ఎపి ప్రజల మనోగతాన్ని సైతం పక్కన పెట్టి దెబ్బ తిన్న తీరు చెప్పుకోనుంది. ఈ సభపై టి కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పదిలక్షల మంది మేడ్చల్ లో జరిగే సోనియా, రాహుల్ సభను రాష్ట్రవ్యాప్తంగా వీక్షించే ఏర్పాట్లు ప్రతి ఊరిలో భారీ స్క్రీన్లు పెట్టి మరీ ఏర్పాటు చేసింది.

దుమ్ము లేపనున్న మోడీ,షా ద్వయం ..

ఇక కమలనాధులు టి ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమ సర్వ శక్తులు ధారపోయడానికి సిద్ధం అయ్యాయి. ఏ పార్టీకి లేనంత స్టార్ క్యాంపెయినర్లు సుమారు నలభైమంది బిజెపి తరపున ప్రచారానికి వస్తున్నారు. వీరిలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లపై అన్ని ఆశలు పెట్టుకున్నారు కమలం అభ్యర్థులు. తమ పార్టీ కనీసం 30 స్థానాల్లో గట్టి ప్రభావం చూపుతామని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో గతంకన్నా ఎక్కువ స్థానాలు సాధించాలన్న ప్రణాళికతో కమల దళం శ్రమిస్తోంది.

గులాబీ కి త్రిమూర్తులే అన్ని ....

కారు పార్టీకి త్రిమూర్తులే ప్రచార అస్త్రాలు గా మారారు. గులాబీ దళపతి కెసిఆర్ నేతృత్వంలో కెటిఆర్, హరీష్ రావు లే మొత్తం ప్రచార బాధ్యతలు నెత్తిన పెట్టుకున్నారు. వీరిలో కెసిఆర్, కెటిఆర్ కీలక బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన హైదరాబాద్ బాధ్యతలు కెటిఆర్ పై మోపారు కెసిఆర్. మాటల తూటాలు వదలడంలో తండ్రికి మించిన కెటిఆర్ వ్యూహంపైనే అత్యధిక స్థానాలు వున్న భాగ్యనగర్ ఫలితాలు ఆధారపడివున్నాయి. ఇక కెసిఆర్ వచ్చే రోజులన్నీ సుడిగాలిలా ప్రత్యేక హెలికాఫ్టర్ లో చుట్టి రానున్నారు. అన్ని తానై ఆల్ రౌండర్ గా వ్యవహరిస్తున్నారు ఆయన.

కాంగ్రెస్ కి సహకరించడమే వారిద్దరి పని ...

తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికల్లో పరిమిత పాత్రనే పోషిస్తున్నాయి. కాంగ్రెస్ కి సహకరించడమే ఆ రెండు పార్టీల ప్రధాన పని. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కీలక ప్రాంతాల్లో ప్రచారం చేసే బాధ్యతను అటు కోదండరాం, ఇటు చంద్రబాబు వహించనున్నారు. దాంతో వచ్చేనెల ఐదో తేదీ వరకు తెలంగాణ లో ఎన్నికల ప్రచారం మోత మోగిపోనుంది. ఇక అభ్యర్థుల జయాపజయాలు, అదృష్ట, దురదృష్టాలు డిసెంబర్ 11 తో తేలిపోనున్నాయి.

Similar News