దేశం పరువు గోవిందా....!

Update: 2018-08-26 04:30 GMT

చెప్పుకోవడానికి 125 కోట్ల జనాభా. కానీ ప్రపంచ క్రీడా పటంలో భారత స్థానం అందరిని విస్మయ పరుస్తుంది. క్రీడలను ప్రోత్సహించడం, క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వాలు ఏవైనా నీటి మీద రాతలే. ఇది అనేక సందర్భాల్లో రుజువు కూడా అయ్యింది. ఒక్క క్రికెట్, బ్యాడ్మింటన్ కి తప్ప ప్రభుత్వం మిగిలిన ఆటల పట్ల చూపించే నిర్లక్ష్యం అంతా ఇంతా కాదు. దేశం నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళి అరకొరగా రాణించే మనదేశ స్టార్స్ ఎవరైనా ఉంటే వారు సొంత ఖర్చులు భరించగలిగి నానా తిప్పలు పడినవారు అయ్యివుంటారు. స్టార్ డం వచ్చే వరకు క్రీడా రంగంలో ఉండేవారు చవి చూసే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. తాజాగా ఆసియా క్రీడలకు వెళ్ళిన భారత క్రీడాకారులు నానా అగచాట్లు పడుతున్నారు. ఎందుకంటే ....?

ఫారెక్స్ కార్డుల్లో డబ్బులు లేవుట ...

ఆసియా పోటీల్లో టీం ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించే వారికి డైలీ అలవెన్స్ కింద రోజుకు 50 డాలర్ల చొప్పున చెల్లించాలిసి వుంది. అయితే సంబంధిత అధికారులు చేతులు ఎత్తేశారు. రీజన్ ఏంటి అని ఎవరైనా అడిగితె ఫారెక్స్ కార్డుల్లో డబ్బులు లేవని చెప్పడం మరింత ఘోరం. ఇన్ని బాధలు వున్నా అవన్నీ పంటికిందే భరిస్తూ పేదక్రీడాకారులు దేశం కోసం రక్తం చిందిస్తూ పోరాడుతున్నారు. చాలా విభాగాల్లో పతకాల పండిస్తూ వున్నా క్రీడా శాఖకు కనీస కనికరం లేకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమే. మరోపక్క డబ్బున్న క్రీడాకారులు తమ సొంత సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ ఉండటం ఇక్కడ కూడా పేద, ధనిక వివక్ష నడవటం దేశానికే సిగ్గుచేటు అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇప్పటికైనా భారత క్రీడా మంత్రిత్వ శాఖ మొద్దు నిద్ర వదిలి చర్యలు చేపట్టాలని అంతా కోరుకుంటున్నారు.

Similar News