నామినేషన్ల ప్రక్రియ చిట్ట చివరి రోజు ముందు రోజు అర్ధరాత్రి ఫైనల్ లిస్ట్ ఇచ్చేసింది హస్తం పార్టీ. పెండింగ్ లో ఉంచిన ఆరుస్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేసింది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 94 స్థానాల్లో బరిలో నిలిచి మిగిలిన స్థానాలు మిత్రులకు ఇచ్చింది కాంగ్రెస్. ఈ 94 లో 88 సీట్లను ఇప్పటివరకు ఖరారు చేసింది హస్తం. మిగిలిన సీట్లు లెక్కలు తేల్చడంతో ఇక ప్రచార పర్వం వైపు దృష్టి పెట్టి యుద్ధానికి సన్నద్ధమైంది కాంగ్రెస్.
తుది జాబితా లో ఉన్నది వీరే ...
కాంగ్రెస్ తుది జాబితాలో చోటు దక్కించుకున్న వారి వివరాలు ఇలా వున్నాయి. కోరుట్ల జువ్వాడి నరసింగ రావు, నారాయణఖేడ్ సురేష్ కుమార్ షెట్కార్, సికింద్రాబాద్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నారాయణపేట్ నుంచి వామనగారి కృష్ణ, దేవరకద్ర డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్ కృష్ణయ్య లను ప్రకటించింది కాంగ్రెస్.
ఆ కుటుంబాలకు తప్ప ...
రాజేంద్రనగర్ సీటు ఆశించిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక రెడ్డికి తీవ్ర నిరాశను హస్తం మిగిల్చింది. ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక జానా రెడ్డి కుమారుడు, అల్లుడి కోసం రెండు టికెట్లు అడిగితే ఒకటి దక్కలేదు. అయితే కుటుంబానికి ఒకటే పాలసీలో కోమటి రెడ్డి బ్రదర్స్ కు, పిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది కాంగ్రెస్. టికెట్ల కేటాయింపు పూర్తి అయినా రెబెల్స్ డేంజర్ బెల్స్ మాత్రం కాంగ్రెస్ లో ఇంకా చల్లారలేదు. వీటిని చల్లార్చడానికి ఏర్పాటు చేసిన కమిటీకి మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో మరికొందరికి హామీలు ఇచ్చి పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలను ఆ పార్టీ కమిటీ స్పీడ్ చేసింది. స్క్రూటినీ పూర్తి అయ్యి ఉపసంహరణాల అనంతరం అసలు రెబెల్స్ ఎవరో తేలనుంది.