జగన్ వారి చేత రాజీనామా చేయిస్తారా?
వైసీపీ అధినేత జగన్ ఇద్దరు ఎమ్మెల్సీలకు మాత్రం జగన్ టిక్కెట్లు ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. సీనియర్ నేతలకు కూడా టిక్కెట్లు వస్తాయో? లేదో తెలియదు. సర్వే ప్రకారం తాను టిక్కెట్లు ఇస్తానని జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. కానీ ఇద్దరు ఎమ్మెల్సీలకు మాత్రం జగన్ టిక్కెట్లు ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది. అది కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలే కావడం విశేషం. ఎందుకిలా.. టీడీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన జగన్ తిరిగి వారినే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎందుకు ఖరారు చేసినట్లు? ముందుగానే అక్కడ అభ్యర్థిని ఖరారు చేసి పార్టీని బలోపేతం చేయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తుంది.
భరత్ ను మంత్రిగా...
తొలుత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అభ్యర్థిని జగన్ ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఉన్న భరత్ తిరిగి పోటీ చేస్తారని ఆయనను గెలిపించుకుని వస్తే మంత్రిని కూడా చేస్తానని ప్రకటించారు. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి ఇంకా సమయమున్నా మరోసారి ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ నిర్ణయించుకున్నారు. కుప్పంలో అధికారికంగా తిరిగేందుకు, ఓటర్లకు దగ్గరయ్యేందుకు జగన్ ముందుగానే భరత్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లు తెలిసింది.
దువ్వాడకు టిక్కెట్...
ఇక మరో కీలక నియోజకవర్గం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహించే టెక్కలిలోనూ ఎమ్మెల్సీని అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ను అభ్యర్థిగా జగన్ ప్రకటించడం వెనక వ్యూహం ఏంటన్న చర్చ పార్టీలో జరుగుతుంది. గత ఎన్నికల్లో అచ్చెన్న పై పోటీ చేసి ఓటమి పాలయిన పేరాడ తిలక్ కు ఆ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా ఇదే సమావేశంలో హామీ ఇచ్చారు. అభిప్రాయ బేధాలను పక్కనపెట్టి దువ్వాడ శ్రీనివాస్ ను గెలిపించాలని జగన్ సమావేశంలో నేతలను, కార్యకర్తలను కోరారు. దువ్వాడకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయినా ఎమ్మెల్సీ పదవి పదిలంగానే ఉంటుంది. గెలిస్తేనే అక్కడ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అవుతుంది.
గత ఎన్నికల్లో....
మరి వారిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీకి దింపుతారా? లేదా? అన్న చర్చ పార్టీలో చర్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్సీగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పోటీకి దిగారు. ఒక్క నారా లోకేష్ మాత్రం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా మంగళగిరిలో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అటు రాజీనామా చేసినా, చేయకపోయినా అప్పుడు నేతలిద్దరూ ఓటమిపాలయ్యారు. ఇప్పుడు జగన్ వీరిద్దరి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఇద్దరు ఎమ్మెల్సీలకు మాత్రం టిక్కెట్లను జగన్ కన్ఫర్మ్ చేయడం... అదీ టీడీపీ నేతలు ప్రాతినిధ్యం వహించిన చోట ఈ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారితీస్తుంది.