ఈసారి గెలిపించేది జగన్ కాదట
ఈసారి ఎన్నికల్లో జగన్ తన సొంత ఇమేజ్ తో మళ్లీ అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమే అవుతుంది
ఓటరులో చాలా స్పష్టత ఉంటుంది. ఎవరికి ఓటు వేయాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. స్థానిక పరిస్థితులను బట్టే ఓటు వేస్తారు. తమ నియోజకవర్గంలో నేత పనితీరును బట్టే వారు ఎవరి వైపు మొగ్గు చూపాలన్నది ముందుగానే నిర్ణయించుకుంటారు. గత ఎన్నికల్లో అభ్యర్థులకు అతీతంగా జగన్ చరిష్మా పనిచేసింది. జగన్ పాదయాత్ర, కాంగ్రెస్ పెట్టిన తప్పుడు కేసులు, వైఎస్ మరణం, చంద్రబాబు వైఫల్యం అన్నీ కలసి జగన్ కు అఖండ మెజారిటీని తెచ్చిపెట్టాయి.
జగన్ చరిష్మా....
కానీ ఈసారి అలా జరగకపోవచ్చు. జగన్ ను చూసి గంపగుత్తగా 175 నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసే అవకాశం లేకపోవచ్చు. జగన్ ఐదేళ్ల పాలనను ప్రజలు చూశారు. గత పాలనకు, ప్రస్తుత పాలనకు ఓటర్లు బేరీజు వేసుకుంటారు. పాలనతో పాటు స్థానికంగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధితో పాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని కూడా ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఈసారి జగన్ ఇమేజ్ పనిచేయదన్నది మాత్రం వాస్తవం.
స్థానిక నాయకత్వంపైనే.....
పైకి జగన్ కు చంద్రబాబుకు మధ్య పోటీలా కన్పించినా పోలింగ్ దగ్గరకు వచ్చే సరికి ఓటర్లు ఎమ్మెల్యే అభ్యర్థిని చూస్తారు. అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉండటంతో అభ్యర్థి మార్పును జనం కోరుకుంటారు. ఈ ఎమ్మెల్యే ఐదేళ్ల పాటు తమకు ఏం చేశారన్నది ప్రధానంగా చూస్తారు తప్ప, తమకు అందిన సంక్షేమ పథకాలను చూడరన్నది విశ్లేషకుల అంచనా. స్థానిక సమస్యలే వచ్చే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నది వాస్తవం.
మార్పు కోరుకుంటే..?
అందుకే ఈసారి ఎన్నికల్లో జగన్ తన సొంత ఇమేజ్ తో మళ్లీ అధికారంలోకి వస్తామనుకోవడం భ్రమే అవుతుంది. అభ్యర్థుల ఎంపిక ను బట్టి గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అందుకే ఈసారి జగన్ దాదాపు 70 మంది వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కొత్త రక్తం ఎక్కిస్తేనే మరోసారి జగన్ కు గెలుపు సాధ్యమవుతుంది. లేకుంటే మరోసారి ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలు నెరవేరనట్లే.