బాబును అలా చావుదెబ్బ కొడుతున్నారా?
జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే పదవులను సామాజికవర్గాల వారీగా పంపిణీ చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తున్నారు
నిజమే జగన్ విపక్ష పార్టీని చావు దెబ్బ కొడుతున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు పదవులను సామాజికవర్గాల వారీగా పంపిణీ చేసి చంద్రబాబును మానసికంగా దెబ్బతీస్తున్నారు. టీడీపీ నేతల్లోనూ ఆలోచన రేపుతున్నారు. ఇన్నాళ్లూ మనం ఈ పార్టీలో పనిచేశామా? అన్న ఆవేదనను పసుపు పార్టీలో కల్పిస్తున్నారు. ఇది నిజం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పదవుల విషయంలో చేసిన ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మూడుసార్లు....
చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పక్కన పెడితే 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చంద్రబాబు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో బీజేపీ, జనసేన మద్దతుతో పార్టీని అధికారంలోకి తేగలిగారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులను ఏ మాత్రం పట్టించుకోలేదు. దశాబ్దాలుగా జెండా మోసిన నేతలను సయితం చంద్రబాబు పక్కన పెట్టారు. అమరావతి, పోలవరంపైనే ఫోకస్ పెట్టిన చంద్రబాబు అసలు పదవులు నేతలకు ఇవ్వాల్సి ఉంటుందన్న విషయాన్నే మర్చిపోయారు.
కొందరికే పదవులు...
వత్తిడి తెచ్చిన నేతలకు మాత్రం నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులను కూడా తనకు వ్యక్తిగతంగా ప్రయోజనం ఉన్న వారికే కట్టబెట్టారు. సామాజిక సమీకరణాలను చంద్రబాబు పట్టించుకోలేదు. 2014 ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా టీడీపీ నుంచి గెలవలేదు. అయినా చివరి వరకూ చంద్రబాబు మంత్రి వర్గంలో వారికి స్థానం కల్పించలేదు. జగన్ ను చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు యాభై శాతం పదవులను ఇస్తుండటం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టేసిందనే చెప్పాలి.
తమ ఎదుటే ఎదిగిన నేతకు....
కొన్ని నియోజకవర్గాల్లో తమ ముందే వైసీపీ జెండా పట్టుకున్న నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కడంతో అక్కడ దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న నేతలు ఆలోచనలో పడ్డారు. తాము ఇన్నాళ్లూ పడిన శ్రమకు ఎందుకు గుర్తింపు దొరకలేదన్న ప్రశ్న వారిని వెంటాడుతుంది. కేవలం పైరవీలు, పార్టీకి నిధులు ఇచ్చే వారినే ఎంపిక చేసి మిగిలిన వారిని చంద్రబాబు పట్టించుకోలేదన్నది టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. మొత్తం మీద చంద్రబాబు తన పార్టీలోని నేతలకు పదవులు ఇచ్చి చంద్రబాబును ఇరుకున పెడుతున్నారనే అనుకోవాలి.