ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ జరిగింది. వర్షంలోనూ భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. విశాఖపట్నం జిల్లాలో ఈ సభ మొదటిది. పూర్తిగా స్థానిక సమస్యలపై మాట్లాడిన జగన్.. ప్రజల ద్వారానే చంద్రబాబు హామీలు నెరవేరలేదని చెప్పించారు. నర్సీపట్నం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయ్యన్నపాత్రుడు ఇచ్చిన హామీలు నెరవేరాయా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని ఆరోపించారు. పట్నంలోని 65 వేల మంది జనాభా తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మోడల్ టౌన్ గా మారుస్తామని ఇచ్చిన హామీని టీడీపీ మరిచిపోయిందని విమర్శించారు.