ముంచేసినావు కదయ్యా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. తనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని చెప్పారు.

Update: 2023-05-12 03:02 GMT

ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా శాసించే పరిస్థితిలో ఉండాలి. యాచించే స్థితిలో ఉండకూడదు. యాచించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరూ నమ్మరు. అధినేతను నమ్మి మునిగేందుకు ఎవరూ సిద్ధపడరు. "ఎస్.. నేనే ముఖ్యమంత్రిని... నన్ను.. నా పార్టీ అభ్యర్థులను గెలిపించండి.. నేను ఈ హామీలను అమలు చేస్తా. ప్రజలకు మంచి చేస్తా" అని చెప్పడం రాజకీయ నేతకు ముఖ్యం. అంతే తప్ప నావల్ల కాదు.. అవతలి పార్టీ వాళ్లను ఓడించడానికే తాను పొత్తులు పెట్టుకుంటున్నానని చెబితే మాత్రం ఎవరూ నమ్మరు. పక్కన ఉండే వాళ్లే చీదరించుకుని వెళ్లిపోతారు.

ఇదేనా వ్యూహమంటే....
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి అలాగే ఉంది. ఒక వ్యూహం లేదు. పాడూ లేదు. 2014లో తన వల్లనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఈసారి తాను కలిస్తే విజయం ఖాయమని, వైసీపీని ఓడించవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదు. కానీ భవిష్యత్‌లో పవన్ కల్యాణ్‌కు మాత్రమే రాజకీయంగా ఇబ్బంది. ఐదేళ్ల కోసం రాజీ పడినా... ప్రత్యర్థిపై ఆగ్రహంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా... ఆశలు లేకుండా రాజకీయాల్లో రాణించడం అనేది జరగనే జరగదు. కానీ పవన్ కల్యాణ్ తనకంటూ ఒక వ్యూహం ఉందని చెబుతూనే వ్యూహం లేకుండా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలే అంగీకరిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఇన్నాళ్లూ మూసి ఉంచిన గుప్పిట తెరిచినట్లయిందని చెబుతున్నారు.
బలమున్న స్థానాలంటే...?
తనకు బలమున్న స్థానాల్లోనే పోటీ చేస్తానని చెప్పడంతో రాష్ట్రంలో ఉప ప్రాంతీయ పార్టీగా ఆయన తనంతట తాను సె‌ల్ఫ్ గోల్ వేసుకున్నారన్నది విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. పన్నెండేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నా జనసేన మాత్రం ఇప్పటికీ ఏపీలో పవన్ కల్యాణ్ పార్టీ బలపడలేదు. పవన్ కల్యాణ్ కు కావాల్సినంత గ్లామర్ ఉన్నప్పటికీ అది పాలిటిక్స్‌లో పనికి రావడం లేదు. చంద్రబాబు టీడీపీ అధినేతగా ఉన్నంత వరకూ ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం అసహజమే అయినప్పటికీ, ప్రజలు తనను గెలిపిస్తే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పడం గాల్లో దీపం పెట్టడం లాంటిదే. నాయకుడికే నమ్మకం లేకపోతే ఇక క్యాడర్‌కు, కల్యాణ్ సామాజికవర్గానికి విశ్వాసం ఎందుకుండాలి? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన వద్ద సమాధానం లేదు.
బలహీనత బయటపెట్టి...
బలాన్ని బట్టి సీట్ల ను పొత్తుల్లో భాగంగా కోరతానని పవన్ కల్యాణ్ చెప్పడం కూడా ఆయన తన బలహీనతను బయట పెట్టుకోవడమే. అంటే తనకు కొన్ని ప్రాంతాల్లోనే బలముందని ఆయన చెప్పకనే చెప్పారు. దానికి ప్రాతిపదిక ఏంది? అన్న ప్రశ్నకు మాత్రం నో ఆన్సర్. బలం అంటే ఓట్లు అన్నది రాజకీయ పార్టీలు చూస్తాయి తప్పించి సామాజికవర్గాన్నో, ఫ్యాన్స్‌నో చూడరు. అంటే చంద్రబాబు పది స్థానాలు ఇస్తామని చెప్పినా పవన్ ఒప్పుకునేటట్లుందన్న అభిప్రాయం జనసైనికుల్లో ఏర్పడనుంది. అది భవిష్యత్‌‌లో పార్టీకి ప్రమాదకరంగా మారనుంది. ఇవేమీ పట్టించుకోని పవన్ కల్యాణ్ మాత్రం తాను బీఆర్ఎస్, బీజేపీలు పొత్తులతో బలపడలేదా? అని ప్రశ్నిస్తుండటం ఆయన అమాయకత్వానికి నిదర్శనంగా చూడాలి తప్ప. అవగాహన ఉండి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనుకోవడం లేదు. ఆయన ఇప్పుడు పొత్తులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. ఎందుకంటే అందుకు ఇంకా సమయం ఉంది.
రెండు జిల్లాలకే పరిమితమా?
పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఫ్రస్టేషన్‌ నుంచి తేరుకోలేదనే అనిపిస్తుంది. తన ఓటమికి ప్రజలే కారణమని ఆయన చెప్పడం, తన బలం పరిమితమని చెప్పడాన్ని చూస్తే ఆయన రాజకీయంగా ఎంత బలహీన నేతో చెప్పకనే తెలుస్తుంది. ఎవరూ అనుకోకుండా సూపర్ స్టార్‌లు కాలేరని వ్యాఖ్యానించి సినిమాలకు, రాజకీయాలకు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. తనకు రాయలసీమలో బలం లేదని చెప్పి అక్కడ పార్టీని మరింత బలహీన తనంతట తాను మార్చేశారు. కేవలం రెండు జిల్లాలకే ఆ పార్టీని మార్చే పరిస్థితికి పవన్ కల్యాణ్ తీసుకు వచ్చారు. అక్కడ కూడా బలం ఉందని చెప్పడానికి లేదు. రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసి ఎన్ని స్థానాల్లో గెలుస్తారన్నది ఇక తేలాల్సి ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో పవన్ కల్యాణ్ తనంతట తాను వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధంగా ఎన్నికలకు ఏడాది ముందే మార్చేశారు. ఇక పార్టీలో ఎవరు చేరతారన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనికి ఆయన వద్ద నుంచి సమాధానం కోసం జనసైనికులు వేచి చూస్తున్నారు.


Tags:    

Similar News