బలమైన సంతకం అంటే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లెక్కలు వేరుగా ఉన్నాయి. పొత్తులపై ఇంతవరకూ చర్చలు మొదలు కాలేదని చెప్పారు
పవన్ లెక్కలు వేరుగా ఉన్నాయి. పొత్తులపై ఇంతవరకూ చర్చలు మొదలు కాలేదని ఆయన రెండు రోజుల క్రితం జరిగిన బందరు సభలో ప్రకటించారు. ఆచితూచి అడుగులు వేస్తానని భరోసా ఇచ్చారు. క్యాడర్ కోరుకుంటున్నట్లే అంతా జరుగుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను బలిపశువుకాబోనన్న పవన్ ఈసారి ప్రయోగాలకు సిద్ధపడనని కూడా చెప్పేశారు. బలమైన సంతకమే ఉంటుందన్న సంకేతాలు పవన్ క్యాడర్ కు ఇచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్. జనసేనది బలమైన సంతకం అంటే ఏంటి? బలమైన సంతకం అంటే ముఖ్యమంత్రి పదవి తప్ప మరొకటి కాదు. మంత్రులు అనేక మంది ఉంటారు కాబట్టి దానిని రాజకీయ భాషలో బలమైన సంతకం అనబోరు.
డిప్యూటీ సీఎంగా...
ఉప ముఖ్యమంత్రి పదవి అందామనుకున్నా అది కేవలం ఆరోవేలు కింద లెక్కే. దానికి ఎలాంటి అధికారాలుండవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ నోట వెంట బలమైన సంతకం అంటే ముఖ్యమంత్రి పదవి తాను పొత్తులో భాగంగా కోరుకుంటానని క్యాడర్ కు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అలా కాకుంటే పొత్తులు ఉండవని కూడా స్పష్టం చేశారు. ఇందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ అవసరం టీడీపీకి కూడా అవసరం. అంతే స్థాయిలో పార్టీని మరో ఐదేళ్లు నడపాలంటే పవన్ కూ టీడీపీ నీడ అంతే అవసరం. ఈ నేపథ్యంలోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు.
ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా....
ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా కింద పొత్తులు కుదుర్చుకుంటారా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంటే రెండున్నరేళ్లు పవన్, మరో రెండున్నరేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉంటారు. దీనికి చంద్రబాబు అంగీకరిస్తే... ముందు ఎవరన్న ప్రశ్న ఖచ్చితంగా తలెత్తక మానదు. చివరి రెండున్నరేళ్లు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి పదవి కోసం వెయిట్ చేయరు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. అందులో ఢక్కామొక్కీలు తిన్న చంద్రబాబును రాజకీయంగా ఎవరూ నమ్మరు. నమ్మి దిగినా తన పార్టీ గుర్తుపై గెలిచిన వారిని ఎగరేసుకుపోరన్న గ్యారంటీ లేదు. 2014 ఎన్నికల్లో టీడీపీకి బలమున్నా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకోగలిగారు. ఇప్పుడు పొత్తులో ఉంటే జనసేన ఎమ్మెల్యేలను ఆకర్షించరన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు.
సర్వేలు చేయించుకున్న తర్వాతే...
అందుకే పవన్ కల్యాణ్ ఈసారి పొత్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అందుకే ఆయన సర్వేలు చేయించడానికి రెడీ అవుతున్నారు. జనసేనకు అత్యధిక స్థానాలు వస్తాయని సర్వే నివేదికల్లో తేలితే ఒంటరిగా పోటీ చేసే అవకాశముందని కూడా స్పష్టం చేశారు. లేకుంటే పొత్తు తప్పదని సంకేతాలు ఇచ్చారు. అంటే పవన్ సర్వేలపై ఆధారపడి ఈసారి పొత్తుల నిర్ణయం తీసుకోబోతున్నారన్న మాట. అలాగే తనతో పాటు ఈసారి జనసేన అభ్యర్థులందరూ శాసనసభలో అడుగు పెడతారని కూడా వ్యాఖ్యానించారు. ఇరవై స్థానాలకే పరిమితం చేస్తారన్న ప్రచారాన్ని కూడా ఆయన కొట్టి పారేశారు. అంటే ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఆ స్థానాల సంఖ్య లెక్క మరి పొత్తుల చర్చలు ప్రారంభమయితే గాని తేలదు. మొత్తం మీద పవన్ పొత్తుతోనే వెళతారు. కానీ ఏఏ స్థానాల్లో, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న లెక్క మాత్రమే తేలాల్సి ఉంది.