ఎట్టకేలకు జనసేన పార్టీకి గుర్తు లభించింది. కేంద్ర ఎన్నికల సంఘం పెండింగ్ లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తులు మంజూరు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతున్న జనసేన పార్టీకి గాజు గ్లాస్ ను కేటాయించింది. ఈ గుర్తుపై ఎపి లోని 25 పార్లమెంట్ స్థానాల్లోనూ, తెలంగాణ లోని 17 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయొచ్చు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉండటంతో పార్టీ గుర్తును జనసేనాని పవన్ కల్యాణ్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సమయం సరిపోతుంది.
అప్పుడు పార్టీ పెట్టినా ...
జనసేన పార్టీ వాస్తవానికి 2014 ఎన్నికల బరిలోకి దిగవలసివున్నా పోటీ చేయకుండా టిడిపి, బిజెపి లకు మద్దత్తుగా ప్రచారం సాగించింది. దాంతో ఎన్నికల గుర్తు కోసం ఆ పార్టీ దరఖాస్తు చేసుకోలేదు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అన్ని స్థానాల్లో బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని గుర్తు కేటాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తును పరిశీలించిన ఈసీ గాజు గ్లాస్ గుర్తును జనసేన కు కేటాయించింది. తమ పార్టీకి గుర్తు లభించడంతో ఇప్పుడు జనసైన్యం సంబర పడుతుంది. జనంలోకి విస్తృతంగా పార్టీ గుర్తును తీసుకువెళ్లే అన్ని మార్గాలను వినియోగించేందుకు సిద్ధమైంది. గుర్తు గుర్తుంచుకోమంటూ ప్రజల చెంతకు వెళ్లనుంది.