బ్రదర్స్ .. బాధంతా అదేనట

జేసీ బ్రదర్స్ జిల్లా పై పెత్తనం కోరుకుంటారు. వారు ఏ పార్టీలో ఉన్నా అనంతపురం జిల్లాలో తమ మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు.

Update: 2022-03-23 06:07 GMT

రాజకీయ నేతలు ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండాలి. అయితే హైపవర్ యాక్టివ్ గా ఉండకూడదు. చేయి, నోరు అదుపులో ఉండాలి. ఈ రెండు అదుపులో ఉండని నేతలు ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్లే జేసీ బ్రదర్స్. ఇద్దరూ తమ నోటికి ఎప్పుడూ పనిచెబుతుంటారు. వివాదాలకు అడ్రస్ గా నిలుస్తుంటారు. కానీ కొంతకాలంగా జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు కొంత మౌనంగానే ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి భయపడి మాత్రం కాదు. టీడీపీ పై అసంతృప్తి వల్లనేనట.

పెత్తనం కోరుకోవడానికి...
జేసీ బ్రదర్స్ జిల్లా పై పెత్తనం కోరుకుంటారు. వారు ఏ పార్టీలో ఉన్నా అనంతపురం జిల్లాలో తమ మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు. ముఖ్యంగా తమకు ప్రాబల్యం ఉన్న తాడిపత్రి, అనంతపురం టౌన్, శింగనమల, పుట్టపర్తి, కల్యాణదుర్గం వంటి నియోజకవర్గాల్లో తమ మార్క్ ను చూపించాలని వారు భావిస్తుంటారు. అక్కడ తమకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉందని, తమను అభిమానించే క్యాడర్ ఉందని నమ్ముతారు.
హద్దులు గీసి...
అందుకే జేసీ బ్రదర్స్ ఈ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తూ కొంత హడావిడి చేస్తుంటారు. తాడిపత్రిలో మరో నేత పార్టీ నుంచి అడుగుపెట్టడానికి కూడా అనుమతించని జేసీ బ్రదర్స్ మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం అక్కడి టీడీపీ నేతలకు చెప్పకుండానే వెళ్లి వస్తుంటారు. అయితే టీడీపీ అధినాయకత్వం గట్టి ఆదేశాలు జారీ చేసింది. లోకల్ నాయకత్వం సమ్మతి లేకుండా ఒకరి నియోజకవర్గంలో మరొకరు పర్యటించడానికి వీల్లేదని చెప్పింది. జేసీ బ్రదర్స్ కు కూడా హద్దులు గీసింది. అయితే దీనిని జేసీ బ్రదర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
బాబు పిలిస్తేనే....
పార్టీని బలోపేతం చేయడం కోసం తాము ప్రయత్నిస్తుంటే తమపై పార్టీలోని ఒకవర్గం దుష్ప్రచారం చేస్తుందని వారు చెబుతున్నారు. జిల్లా కమిటీల్లోనూ జేసీ వర్గానికి అధినాయకత్వం మొండి చేయి చూపింది. దీంతో చంద్రబాబు వద్దనే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే చంద్రబాబు పిలిస్తేనే తాము వెళ్లాలని జేసీ ప్రభాకర్ రెడ్డి భావిస్తున్నారు. తమంతట తాముగా హైకమాండ్ వద్దకు వెళ్లవద్దని, అధినేత పిలిస్తేనే వెళ్లాలన్నది జేసీ బ్రదర్స్ ఆలోచనగా ఉంది. అందుకే అప్పటి వరకూ మౌనంగా ఉండాలని జేసీ బ్రదర్స్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.


Tags:    

Similar News