తాము ప్రశాంతంగా ఆశ్రమంలో ఉండగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు తమపై దాడి చేశారని ప్రభోదానం స్వామి ఆశ్రమ కమిటీ సభ్యులు ఆరోపించారు. బుధవారం వారు మాట్లాడుతూ... తమపై కేవలం అసత్య ప్రచారం జరుగుతుందని, 20 ఏళ్లుగా ప్రభోదానందపై జేసీ దివాకర్ రెడ్డి కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. 20 ఏళ్ల క్రితం జేసీ ఆదేశాలను కాదని అప్పటి బీజేపీ నేతలు ఆలె నరేంద్ర, వేణుగోపాల్ రెడ్డి వంటి వారు తాడిపత్రికి వస్తే ఆశ్రయం కల్పించారని, దీంతో అప్పడే ఆశ్రమంపై జేసీ వర్గీయులు దాడులు చేసి, తప్పుడు కేసులు పెట్టిస్తే ప్రభోదానంద వీరి అక్రమాలు తట్టుకోలేక కర్ణాటక వెళ్లిపోయారని తెలిపారు.
భక్తులు వస్తుండటంతో......
ఇప్పుడు మళ్లీ తాడిపత్రిలో ఆశ్రమం స్థాపించగా భక్తులు ఎక్కువగా రావడంతో జేసీ జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. స్వామి కుమారులు ఈ మధ్య బీజేపీలో చేరారని, దీంతో జేసీకి రాజకీయంగా ఇబ్బంది ఉంటుందనే ఈ రకంగా ఆశ్రమంపై కుట్రలు చేస్తున్నారని వారు స్పష్టం చేశారు. జేసీ వర్గీయులే ముందుగా దాడి చేయడంతో ఆశ్రమంలో ఉన్న వారు ప్రతిఘటించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కావాలంటే ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇస్తామన్నారు.