తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమయినట్లే కన్పిస్తోంది. ఆయన మీడియా సమావేశంలో ఈవిషయాన్ని చెప్పకనే చెప్పారు. ముందస్తు ఎన్నికలు అన్న మాటను ఆయన అంగీకరించకపోయినా....ఆయన చెప్పిన దాన్ని బట్టి త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్లమెంటుతో పాటు జరిగే ఎన్నికల కన్నా, కొంత ముందుగా వెళితే టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని ఆయన అంచనా.
అభ్యర్థుల ఎంపిక వేగంగా.....
అందుకోసమే ఆయన సెప్టెంటరులో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పకనే చెప్పారు. సెప్టంబరు మాసంలోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచన. సెప్టెంబరు 2న హైదరాబాద్ ప్రగతి నివేదన సభ పేరిట భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ ఏర్పాటు చేయనుంది. ఈ సభ ఎన్నికల శంఖారావంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే అభ్యర్థుల ఎంపిక కసరత్తును కేసీఆర్ ముందుగానే ప్రారంభించారని చెబుతున్నారు.
పార్లమెంటుతో పాటు జరిగితే.....
పార్లమెంటుతో పాటు ఎన్నికలు జరిగితే దానిపై జాతీయ పార్టీల ప్రభావం పడే అవకాశముంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ క్రమంగా తగ్గుతుండటం, కాంగ్రెస్ కొంత మెరుగుపడుతుండటం కేసీఆర్ కు ఆందోళన కల్గిస్తుందంటున్నారు. రాష్ట్రంలో ప్రధాన శత్రువైన కాంగ్రెస్ పార్టీ బలపడక ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి, అందులో విజయం సాధిస్తే పార్లమెంటు స్థానాలను సులువుగా కైవసం చేసుకోవచ్చన్న వ్యూహం ఉండవచ్చంటున్నారు.
క్యాడర్ కు సంకేతాలు......
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు కూడా కేసీఆర్ తమ రాష్ట్ర ఎన్నికలు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికలతో పాటే జరపాలని కోరినట్లు చెబుతున్నారు. అందుకు ప్రధాని కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అందువల్లే కేసీఆర్ హడావిడిగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. సిట్టింగ్ లందరికీ దాదాపు టిక్కెట్లు ఖాయమని తేలడంతో వారు ఇక ప్రజాక్షేత్రంలోనే ఉండి అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో కోరినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.