తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కాక రేపుతోంది. సభకు ముందు టి బాస్ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. అన్ని వర్గాలపై వరాలు కురిపించి శాసనసభను టి సిఎం రద్దు చేసి గవర్నర్ ను కలిసి అక్కడినుంచి సభకు బయల్దేరి వెళతారని విశ్లేషకులు భావిస్తున్నారు. చెప్పింది చెయ్యకుండా, చేసేవి చెప్పకుండా ఎత్తులు వేసే కెసిఆర్ ఏ నిమిషంలో ఎలాంటి అడుగులు వేస్తారో ఎవ్వరు చెప్పలేని అంశం. దాంతో సర్వాత్రా ఆదివారం భాగ్యనగర్ లో ఏమి జరగబోతుందన్న ఆసక్తి టి ట్వంటీ మ్యాచ్ ను మించి టెన్షన్ కలిగిస్తుంది. దాంతో అందరి అటెన్షన్ కెసిఆర్ క్యాబినెట్ సమావేశంపై వుంది.
అన్ని సిద్ధం ...
చరిత్రలో నిలిచే సభ నిర్వహించి జనంలోకి దూసుకువెళ్ళాలన్న స్కెచ్ తో గులాబీ బాస్ భారీ కార్యక్రమం తలపెట్టారంటున్నారు. ఆ లెక్కల్లో వెళితే ప్రత్యర్థులకు వణుకు పుట్టించ వచ్చని పింక్ పార్టీ వ్యూహం. టీఆరెస్ తో తలపడి నిలబడే వారు లేరన్న గట్టి నమ్మకం ప్రజల్లో ఏర్పడాలన్న ఎత్తుగడే ఇంతటి భారీ కార్యక్రమం ఏర్పాటుకు మూలం అంటున్నారు విశ్లేషకులు. గత వారం రోజులుగా టి సీఎం పనితీరు గమనించిన ప్రతి ఒక్కరికి ఆయన ముందస్తుకు సిద్ధమై వెళుతున్నారన్న సంకేతాలు వెలువడుతూనే వున్నాయి. ప్రగతి నివేదన సభకు ఒక రోజు ముందు కూడా విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ ని ఊహించని రీతిలో 35 శాతం చేసి పారేశారు ఆయన. జోన్ల విభజన ప్రక్రియకు ఢిల్లీ వెళ్ళి మరి ఆమోదించుకోవడం ఆ వెంటనే 10 వేల ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడం ఇలాంటివన్నీ కేసీఆర్ సమరశంఖం పూరించడానికే అన్నవి స్పష్టం చేస్తున్నాయి . మరి ఆయన ఏ రూట్ లో వెళతారన్నది చూడాలి.