గులాబీ పార్టీ సీమాంధ్రులకే కాదు భాగ్యనగర్ కి వచ్చి స్థిరపడ్డ వివిధ రాష్ట్రాల వలసవాదులందరికి వల విసిరింది. ఉత్తరాది, దక్షిణాది నుంచి వ్యాపారాలు రీత్యా వచ్చి స్థిరపడిన వారు లక్షల సంఖ్యలో వున్నారు. వీరందరిని అక్కున చేర్చుకుని కీలకమైన తటస్థ ఓట్లను ఆకర్షించే పనిలో పడింది. వచ్చే ఎన్నికల్లో వీరి ఓట్లే గెలుపు ఓటములను నిర్ణయిస్తాయని గులాబీ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కీలకమైన వారిని గుర్తించి వారిని కారు ఎక్కించి పదవులు కట్టబెడుతుంది టీఆర్ఎస్.
సీట్ల ప్రకటన కోసం కూటమి ...
గత ఎన్నికల్లో ఎక్కడ దెబ్బతిన్నామో అక్కడ సరిచేసుకునే పనిలో గులాబీ పార్టీ దూసుకుపోతుంది. అధికార పార్టీకి కళ్లెం వేసేందుకు ప్రతి వ్యూహాన్ని అమలు చేయాలిసిన మహాకూటమి మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటన ఎప్పుడెప్పుడా అన్న ఆశగా ఎదురు చూస్తూ పుణ్యకాలం గడిపేస్తుంది. సీట్ల పంపకాల అంకెల్లో తేడాలొచ్చాయి. తెలంగాణ జనసమితి, సీీపీఐ పార్టీల సీట్లు లెక్కలు తేలలేదు. ఆ రెంుడ పార్టీలూ అసంతృప్తితో ఉన్నాయి.
ఒక రౌండ్ చుట్టేశారు.....
కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన చేయడానికి మరో నాలుగురోజుల సమయం పట్టే అవకాశముంది. ఇది ఒకరకంగా కారు స్పీడ్ కి మరింత జోష్ పెంచేలా చేస్తుంది. వ్యూహాత్మకంగా అన్ని కులాలు, మతాలు, వర్గాలను ఇప్పటికే ఒక రౌండ్ గులాబీ అభ్యర్థులు చుట్టేశారు. ఒక నెలరోజుల సమయమే వున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ల అంశం తేల్చకపోవడంతో నిరాశలో కూటమి లోని ఆశావహులు కొట్టుమిట్టాడుతున్నారు.